అరకు ఉత్సవ్ ఆరంభం అదుర్స్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:01 AM
అరకు ఉత్సవ్ గురువారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్సవ్ ప్రధాన వేదిక వద్ద పలు రాష్ట్రాల కళాకారుల కార్నివాల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్సవాన్ని ప్రారంభించిన మంత్రులు దుర్గేశ్, సంధ్యారాణి
ప్రత్యేక ఆకర్షణగా వివిధ రాష్ట్రాల కళాకారుల కార్నివాల్
సింగపూర్ బృందం కచేరీ హైలెట్
అరకులోయ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవ్ గురువారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్సవ్ ప్రధాన వేదిక వద్ద పలు రాష్ట్రాల కళాకారుల కార్నివాల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొమ్ము కిరీటాలు ధరించి గిరిజన సంప్రదాయ తుడుము, డోలు వాయిస్తూ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ ప్రదర్శనలు ఇచ్చారు. పులివేషాలు, చెక్కభజనలు, తప్పెటగుళ్లు, కూడిపూడి నృత్యం, భరతనాట్యం, కొమ్ముకోయ, పగటి వేషాలు, డప్పులు, కాళికా అవతారం, బుట్టబొమ్మలు, గరగలు, కేరళ డ్రమ్స్, శంఖునాథం, బోనాల కోలాటం, తదితర ప్రదర్శనల్లో సుమారు 700 మంది కళాకారులు పాల్గొన్నారు. వేదికపై సింగపూర్ బృందం నిర్వహించిన కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కళాకారులను అతిథులు సత్కరించారు.
స్టాల్స్ ప్రారంభం
ఉత్సవ్‌లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు స్టాల్స్‌ను మంత్రులు దుర్గేశ్, సంధ్యారాణి ప్రారంభించారు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆహ్వానం మేరకు వారు కారవాన్ వాహనాల స్టాల్‌ను పరిశీలించారు. వాహనంలోని సదుపాయాలను తిలకించారు. అనంతరం మిగతా స్టాల్స్‌ను సందర్శించారు. కాగా థింసా కళాకారులతో మంత్రులు దుర్గేశ్, సంధ్యారాణి, అధికారులు కొంత సేపు నృత్యం చేసి అందర్నీ అలరించారు.
సాంస్కృతిక కళలకు పునరుజ్జీవం
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ఆదివాసీల నృత్యాలతో సహా అంతరించిపోతున్న సాంస్కృతిక కళలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో కళ, సాంస్కృతిక వైభవం నీరుగారిందని విమర్శించారు. విశాఖ మన్యంలోని గిరిజన యువతకు తమ సొంత ఇల్లే ఆదాయ వనరులుగా మారడం, స్థానిక వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం తాము సాధించిన అతిపెద్ద విజయమని ఆయన తెలిపారు. ఆంధ్రుడి ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు సరికొత్త చిరునామాగా మారుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
స్థానికులకు ఉపాధి కల్పనకు ప్రణాళిక
గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా అరకులోని పర్యాటక కేంద్రాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇక్కడకు వస్తున్నారని, ఆయన రాకతో ఉత్సవాలకు మరింత శోభ వస్తుందన్నారు. ‘తాగితే అరకు కాఫీ తాగాలి.. తింటే అనకాపల్లి బెల్లం తినాలి.. చూస్తే విశాఖ ఉత్సవ్ చూడాలి’ అని ఆమె అన్నారు.
పెరిగిన పర్యాటకుల సంఖ్య
గతంలో ఏటా సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది అరకును సందిర్శించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 72 లక్షలకు చేరుకోవడం గర్వకారణమని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. పర్యాటకుల కోసం సుమారు 150 హోటళ్లు, రిసార్టుల్లో 3,000కు పైగా గదులను అందుబాటులోకి తెచ్చామన్నారు. అరకు పరిసర ప్రాంతాల్లో 21 ప్రధాన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, ఐటీడీఏ, స్థానిక పంచాయతీలు, అటవీ, నీటిపారుదల శాఖల సమన్వయంతో పర్యాటక రంగ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గత ఏడాది సుమారు రూ.46 కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. 680 గిరిజన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి అరకు, పాడేరు, అనంతగిరి ప్రాంతాల్లో హోం స్టేలను ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటకులకు రుచికరమైన గిరిజన వంటకాలను అందించడానికి ‘అరకు కౌని’ వంటి ప్రత్యేక డిష్‌లను సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 30న శనారీ బ్యాండ్, 31న ప్రముఖ గాయని సునీత సంగీత విభావరి, ఫిబ్రవరి 1న రామ్ మిరియాల సంగీత కచేరీ, అరకు డిగ్రీ కళాశాల విద్యార్థులతో ట్రైబల్ ఫ్యాషన్ షో ఉంటాయన్నారు. ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర, ఏపీటీడీసీ డైరెక్టర్ కిల్లు వెంకట రమేశ్‌నాయుడు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి అంబేడ్కర్, సహాయ కలెక్టర్ సాహిత్, ఆర్డీవో ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.