అరకు ఉత్సవ్ అదుర్స్
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:40 PM
అరకు ఉత్సవ్-2026 ముగింపు అదిరింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి జన సందోహం పోటెత్తింది. వేదికపై గిరిజన విద్యార్థుల ఫ్యాషన్ షో అలరించింది. ఆపై అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
ముగింపు కార్యక్రమంలో అలరించిన ప్రదర్శనలు
గిరిజన విద్యార్థినుల ఫ్యాషన్ షో
అధికారులు, ప్రజాప్రతినిధుల ర్యాంప్‌వాక్
హాజరైన ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అరకులోయ,ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవ్-2026 ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్సాహపూరితంగా సాగింది. జనవరి 29వ తేదీన ప్రారంభమై ఉత్సవ్ ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ముగింపు వేడుకకు రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి, అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాన వేదికపై అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఫ్యాషన్ షో అందర్నీ అలరించింది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థినులు ఒడియా పాటలకు ధింసా మాదిరిగా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం పలు రాష్ర్టాల నుంచి విచ్చేసిన కళాకారులరుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
నాయకులు, అధికారుల ర్యాంప్ వాక్
విద్యార్థినుల ఫ్యాషన్‌లో మేము సైతం అంటూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాకిత్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర దంపతులు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే విధంగా అల్లూరి కలెక్టర్ దినేశ్‌కుమార్ సతీమణి అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ముగింపు కార్యక్రమానికి హాజరై ప్రదర్శనలు తిలకించారు. ముగింపు రోజు కావడంతో జనం పోటెత్తారు. వేల సంఖ్యలో కుమ్మేశారు. ఉత్సవ్ మైదానం అంతా జనమయం అయ్యింది. ఫుడ్‌కోర్టులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కుల్లో కుటుంబాలతో సరదాగా గడిపారు.
ప్రకృతి ఒడిలో సేదదీరేందుకే ఉత్సవ్ : మంత్రి సంధ్యారాణి
ప్రకృతి ఒడిలో సేదదీరేందుకే అరకు ఉత్సవ్‌ను నిర్వహించినట్టు రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకు ఉత్సవ్ ముగింపు వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో జీవనం సాగించే వారందరు శ్రమను కాసేపు మర్చిపోయి.. ప్రకృతి అందాల మధ్య అరకు కాఫీని తాగుతూ.. మంచు అందాలను ఆస్వాదిస్తూ.. చిరుధాన్యాలతో తయారు చేసిన అరకు డిష్ రుచులు చూసేందుకు ఉత్సవ్ అవకాశం కల్పించిందన్నారు. నాలుగురోజులు పండగ వాతావరణంలో ప్రజలు ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా యంత్రాగాన్ని చక్కగా సమన్వయం చేస్తూ ఉత్సవ్‌ను విజయవంతం చేసిన కలెక్టర్ దినేశ్‌కుమార్‌ను మంత్రి సంధ్యారాణి అభినందించారు. అనంతరం ఉత్సవ్‌కు విచ్చేసిన మంత్రి సంధ్యారాణి రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, జీసీసీ చైర్మన్ శ్రావన్‌కుమార్, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఆర్‌డీవో లోకేశ్, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, జనసేన అరకు ఇన్‌చార్జి చిరంజీవి, ఏఎంసీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్ డిజైన్ పోటీలు, ఫ్లవర్ షోలను తిలకించిన మంత్రి
అరకు ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజు ఆదివారం అంజోడ ఫైనరీని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవితో కలిసి సందర్శించారు. అంజోడ ఫైనరీలో జరుగుతున్న ఆర్ట్ డిజైన్ పోటీలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టిస్టులు వేస్తున్న చిత్రాలను తిలకించారు. పద్మాపురం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షోను సందర్శించారు. ఫ్లవర్ షో వివరాలను జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, ఇతర అధికారులు వివరించారు. అంతకుముందు ఫైనరీలో మూడురోజులు పాటు జరిగిన ఉత్సవాలతో పాటు గిరిజన ప్రాంతాలలో గిరిజనుల జీవనశైలి, పర్యాటక ప్రాంతాలకు సంబధించిన ఏవీని తిలకించారు. ఆదివారం ఉదయం ఉడెన్‌బ్రిడ్జి నుంచి గాలికొండ వరకు ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్‌లో పలువురు పాల్గొన్నారు. ఉడెన్‌బ్రిడ్జి నుంచి గాలికొండ పైనుంచి వ్యూపాయింట్ వరకు ట్రెక్కింగ్ సాగింది.