Share News

అంతర్జాతీయ మార్కెట్‌లోకి అరకు లీఫ్‌ కాఫీ

ABN , Publish Date - Mar 15 , 2026 | 10:48 PM

అంతర్జాతీయ మార్కెట్‌లో తొలిసారిగా అరకు లీఫ్‌ కాఫీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హైదరాబాద్‌ గ్రీన్‌ ఆయూష్‌ సంస్థ సీఈవో పులి రాజేశ్‌ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్‌లోకి అరకు లీఫ్‌ కాఫీ
పెద్దూరులో కాఫీ తోటల ఆకులను పరిశీలిస్తున్న గ్రీన్‌ ఆయుష్‌ సీఎండీ రాజేశ్‌

ఎగుమతులకు 27 దేశాలతో ఒప్పందాలు

ఐటీడీఏతో ఎంవోయూకి చర్యలు

గ్రీన్‌ ఆయుష్‌ సీఎండీ రాజేశ్‌

చింతపల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్‌లో తొలిసారిగా అరకు లీఫ్‌ కాఫీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హైదరాబాద్‌ గ్రీన్‌ ఆయూష్‌ సంస్థ సీఈవో పులి రాజేశ్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని కొండవచుల, పెద్దూరు గ్రామాల్లోని కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అరకు లీఫ్‌ కాఫీపై అవగాహన కల్పించారు. అనంతరం రాజేశ్‌ మాట్లాడుతూ చింతపల్లి మండలంలోని తోటల నుంచి కాఫీ ఆకులను సేకరించి హైదరాబాద్‌లో ఫుడ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారన్నారు. ఐదేళ్ల కృషి ఫలితంగా అరకు లీఫ్‌ కాఫీ డిప్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అరకు లీఫ్‌ కాఫీని 2025 నవంబరులో దుబాయ్‌లో నిర్వహించిన ఆర్గానిక్‌ నేచురల్‌ ప్రొడక్స్‌ ఎక్స్‌పోలో ప్రదర్శించామన్నారు. 27 దేశాల పారిశ్రామికవేత్తలు అరకు లీఫ్‌ కాఫీని మార్కెటింగ్‌ చేసేందుకు ముందుకు రావడంతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు. అరకు లీఫ్‌ కాఫీ ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతులు పొందామన్నారు. గింజల నుంచి ఉత్పత్తి చేసిన కాఫీ కంటే ఆకుల ద్వారా ఉత్పత్తి చేసిన కాఫీలో కెఫిన్‌, అసిడిటీ తక్కువగా ఉందన్నారు. దీంతో అరకు లీఫ్‌ కాఫీకి ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఇష్టపడుతున్నారన్నారు. చింతపల్లి మండలంలో కొంతమంది రైతులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. అధిక మొత్తంలో ఆకులను సేకరించేందుకు ఐటీడీఏతో ఎంవోయూలు కుదుర్చుకునేందుకు కార్యాచరణ ప్రారంభమైందన్నారు. కాఫీ మొక్కల్లో కాయ, పండ్లు దశ మూడు నెలల మినహా 45 రోజులకు ఒకసారి చొప్పున ఎకరానికి టన్ను ఆకులు ఏడాదికి ఆరు సార్లు సేకరించుకుని మార్కెటింగ్‌ చేసుకోవచ్చునన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇండియన్‌ టీ బోర్డు కిలో టీ ఆకులకు రూ.17.28 కనీస మద్ధతు ధరగా నిర్ణయించిందని, ఇదే ధరను ఆదివాసీ కాఫీ రైతులకు అందజేస్తామని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కి వివరించామన్నారు. కార్యక్రమంలో గ్రీన్‌ ఆయూష్‌ ప్రతినిధులు కనకరాజు, బుజ్జిబాబు, రజక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 10:48 PM