మత్స్యగెడ్డకు జలకళ
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:10 PM
వరుస తుఫాన్లకు కురిసిన భారీ వర్షాలతో మండల పరిధిలోని మత్స్యగెడ్డ పాయలు జలకళను సంతరించుకున్నాయి.
కళకళలాడుతున్న గెడ్డ పాయలు
నిండిన డుడుమ, జోలాపుట్టు జలాశయాలు
విద్యుదుత్పత్తికి తప్పిన ముప్పు
ముంచంగిపుట్టు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
వరుస తుఫాన్లకు కురిసిన భారీ వర్షాలతో మండల పరిధిలోని మత్స్యగెడ్డ పాయలు జలకళను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహంతో మత్స్యగెడ్డ పరవళ్లు తొక్కుతోంది. సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు, లక్ష్మీపురం, పనసపుట్టు, సంగడ తదితర పంచాయతీల పరిధిలోని పలు ప్రాంతాల్లో మత్స్యగెడ్డ నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మత్స్యగెడ్డతోపాటు డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తికి నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన నెలకొంది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్స్యగెడ్డకు పూర్వ వైభవం వచ్చింది. ఫలితంగా మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతం నుంచి జలాశయాలకు భారీగా నీరు చేరడంతో డుడుమ, జోలాపుట్టు రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి. జోలాపుట్టు జలాశయంలో గరిష్ఠ నీటిమట్టం 2,750 అడుగులు కాగా, శుక్రవారం నాటికి 2,750 అడుగులు నమోదైంది. అదేవిధంగా డుడుమ జలాశయంతో గరిష్ఠ నీటిమట్టం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,582.40 అడుగుల నీటిమట్టం ఉన్నట్టు అధికారులు తెలిపారు. డుడుమ జలాశయం నుంచి దిగువ ప్రాంతంలోని బలిమెలకు ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలతో జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడంతో ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తికి నీటి కొరత తప్పినట్టేనని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.