Share News

ఏపీటీడీసీ గలీజు!

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:18 AM

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తీరు చాలా విచిత్రంగా ఉంది.

ఏపీటీడీసీ గలీజు!

అభివృద్ధి చేసేందుకు డబ్బులు లేవంటూనే ఎకరాలకు ఎకరాలు

ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంస్థ

ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం

తాజాగా మధురవాడలో 9.39 ఎకరాలు కేటాయింపు

విలువ రూ.200 కోట్లు

విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తీరు చాలా విచిత్రంగా ఉంది. భూములను అభివృద్ధి చేసేందుకు డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. అక్కడి పెద్దలు కూడా పెట్టుబడులు పెట్టే స్థోమత లేనందున ఎందుకు ఇవ్వాలి?...అని ప్రశ్నించకుండా అడిగిన భూములన్నీ కేటాయిస్తున్నారు. వాటిని అభివృద్ధి చేయడానికి ఆ భూములను లీజు పేరుతో వేరే వారికి అప్పగిస్తామని ఏపీటీడీసీ ముందే చెబుతోంది. అందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం విశేషం.

విశాఖపట్నంలో ఏపీ టూరిజం అథారిటీకి మధురవాడ సర్వే నంబరు 426/3లో 9.39 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో ఇచ్చింది. దాని స్థూల విలువ రూ.199.97 కోట్లు అంటే రూ.200 కోట్లు. అదే మార్కెట్‌ రేటు చూసుకుంటే రూ.300 కోట్లు ఉంటుంది. ఈ భూమిని ఏపీటీడీసీ పేరిట బదలాయించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే వెంటనే చెల్లించడానికి అంత మొత్తం లేదని, ఆ భూమిని అభివృద్ధి చేయడానికి ఎవరికైనా డెవలపర్‌కు లీజుకు ఇచ్చుకుంటామని చెబితే దానికీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ భూమి బేసిక్‌ విలువలో ఒక శాతం లీజు మొత్తంగా వసూలు చేస్తామని ఏపీటీడీసీ తెలిపింది. అంటే ఏడాదికి రూ.2 కోట్లు. ఆ పద్ధతి ప్రకారం ఆ భూమిని తీసుకుంటామని పేర్కొనగా కొన్ని షరతులు విధిస్తూ భూమి బదలాయించాలని ఉత్తర్వులు ఇచ్చారు.

స్టార్‌ హోటల్‌, రిసార్ట్స్‌

ప్రభుత్వం కేటాయించిన భూమిలో స్టార్‌ హోటళ్లు, రిసార్ట్స్‌, ఇతర పర్యాటక ప్రాజెక్టులు ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వాటిని నిర్మించడానికి ఎవరి వద్ద నిధులు ఉన్నాయో వారికి ఏపీటీడీసీ ఆ భూములు లీజుకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ భూములు ఏ కార్పొరేట్‌ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి.

ఏపీటీడీసీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో రిసార్ట్స్‌ నిర్మించి లీజుకు ఇవ్వడం ఆనవాయితీ. అక్కడక్కడా బాగా డిమాండ్‌ ఉన్న పర్యాటక ప్రాంతాల్లో సంస్థే వాటిని నిర్వహిస్తోంది. రుషికొండపై రూ.450 కోట్ల విలువైన భవనాన్ని కూడా లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దానిని ఆనుకొని ఉన్న తొమ్మిది ఎకరాల భూమితో పాటు మరో 2,600 చ.గ. స్థలాన్ని కూడా లీజుకు ఇస్తామని ఇటీవల ప్రకటన జారీ చేసింది.

తనఖాకు కూడా అనుమతిస్తారేమో...

ఏపీటీడీసీ వంటి కార్పొరేషన్ల నుంచి లీజుకు తీసుకున్న భూముల పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి డెవలపర్లు కోట్లాది రూపాయల రుణాలు తీసుకుంటున్నారు. వారు ముఖం చాటేస్తే వాటి బాధ్యత కార్పొరేషన్లపైనే పడుతోంది. జగదాంబ సెంటర్‌లో సూపర్‌ బజార్‌ స్థలాన్ని ఇలాగే ఒక కార్పొరేట్‌ కంపెనీకి లీజుకు ఇస్తే వారు రూ.300 కోట్ల రుణం తీసుకొని దివాలా తీశారు. ఇప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తోంది. విశాఖలో భూములు విలువైనవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ భూములు కాపాడుకోవడం కష్టం అవుతుంది.

Updated Date - Jul 11 , 2026 | 12:18 AM