Share News

రాంకీ ఫార్మా వ్యర్థాల ల్యాండ్‌ఫిల్‌కు ఆమోదం

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:10 AM

పరవాడ రాంకీ ఫార్మా సిటీలో కంపెనీల వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడానికి (ల్యాండ్‌ఫిల్‌)కు అవసరమైన భూమిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాడి గ్రామంలో 50 ఎకరాలు కేటాయించింది. అందులో పది ఎకరాలపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి.

రాంకీ ఫార్మా వ్యర్థాల ల్యాండ్‌ఫిల్‌కు ఆమోదం
ఫార్మా వ్యర్థాల కోసం తాడి గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన భూమి ఇదే

40 ఎకరాలు నోటిఫై చేసిన ప్రభుత్వం

గతంలో కేటాయించిన 91.44 ఎకరాలు ఇతర వినియోగానికి పచ్చజెండా

విశాఖపట్నం/అనకాపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పరవాడ రాంకీ ఫార్మా సిటీలో కంపెనీల వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడానికి (ల్యాండ్‌ఫిల్‌)కు అవసరమైన భూమిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాడి గ్రామంలో 50 ఎకరాలు కేటాయించింది. అందులో పది ఎకరాలపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి. మిగిలిన 40 ఎకరాల్లో ల్యాండ్‌ఫిల్‌ పెట్టుకోవడానికి ఆ భూమిని నోటిఫై చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదిలాఉండగా గతంలో ఇదే ప్రయోజనం కోసం ల్యాండ్‌ఫిల్‌గా ఉపయోగించుకోవడానికి 2005లో అప్పటి ప్రభుత్వం 105 ఎకరాలను కేటాయించింది. అందులో 91.44 ఎకరాలను ఉపయోగించుకోవడానికి నోటిఫై చేసింది. అయితే అందులో వ్యర్థాలను వేశాక ఆ భూమి నుంచి కలుషిత జలాలు బయటకు వెళ్లడం వల్ల పరిసర ప్రాంతాల భూములు దెబ్బతిన్నాయి. దీనిపై స్థానికులు ఆందోళనలు చేయడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ భూమిలో వ్యర్థాలను వేయవద్దని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో కొంత కాలంగా రాంకీ యాజమాన్యం సేకరించిన వ్యర్థాలను పరవాడ నుంచి తీసుకెళ్లి నెల్లూరులో ల్యాండ్‌ఫిల్‌ చేస్తున్నది. అప్పటివరకు టన్ను వ్యర్థాల ల్యాండ్‌ఫిల్‌ రూ.10 వేలు ఖర్చు అయితే... ఇప్పుడు అది లక్ష రూపాయలకుపైగా అవుతున్నది. ఈ మొత్తం సొమ్మును రాంకీ యాజామన్యం ఆయా ఫార్మా కంపెనీల నుంచి వసూలు చేస్తున్నది. ఈ భారాన్ని తాము మోయలేకపోతున్నామని ఆయా కంపెనీలు మొరపెట్టుకోవడంతో కూటమి ప్రభుత్వం కొత్తగా తాడి గ్రామ పరిధిలో 50 ఎకరాలు కేటాయించింది. వివాదాస్పద భూమి పోను మిగిలిన భూమిని వాడుకోవడానికి నోటిఫై చేసినందున, 2005లో కేటాయించి అప్పుడు నోటిఫై చేసిన 91.4 ఎకరాలను ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా ఇప్పుడు తిరిగి డీనోటిఫై చేస్తూ శుక్రవారం మరో ఉత్తర్వు జారీ చేసింది. మొత్తంగా 105 ఎకరాలు అందుబాటులో ఉండడంతో వాటిలో 8.96 ఎకరాలను వినియోగించుకోవడానికి కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు అనుమతులు కూడా ఇచ్చింది. .

Updated Date - Apr 25 , 2026 | 01:10 AM