కేజీహెచ్ అడ్మినిస్ర్టేటర్ నియామకం రద్దు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:17 AM
కేజీహెచ్ అడ్మినిస్ర్టేటర్‌గా బీవీ రమణ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది.
నాన్ క్లినికల్ అధికారి నియామకం చెల్లదన్న హైకోర్టు
గత కొన్నాళ్లుగా అడ్మినిస్ర్టేటర్, సీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోల మధ్య కోల్డ్‌వార్
ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్ అడ్మినిస్ర్టేటర్‌గా బీవీ రమణ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అనేక బోధనాస్పత్రుల్లో అడ్మినిస్ర్టేటర్లుగా డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన అధికారులు నియమితులయ్యారు. దీంతో అనేకచోట్ల ఆర్‌ఎంవోలు, సీఎస్‌ఆర్‌ఎంవోలు, కొత్తగా నియమితులైన అడ్మినిస్ర్టేటర్ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. కేజీహెచ్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. తమ హక్కులకు భంగం కలిగించడంతోపాటు కొన్నేళ్లుగా ఉన్న అధికారాలను కత్తిరించేస్తున్నారంటూ ఆర్‌ఎంవో, సీఎస్‌ఆర్‌ఎంవోలు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తమ అధికారాల్లో ఎవరూ తలదూర్చకుండా చూడాలంటూ కొద్దినెలల కిందట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న డాక్టర్ యు.శ్రీహరి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న బీవీ రమణను కేజీహెచ్ అడ్మినిస్ర్టేటర్‌గా నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు. హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్‌లో ఎండీ చేసినట్టు ఆయన కోర్టుకు తెలియజేశారు. వైద్య, ఆస్పత్రి పరిపాలన అనుభవం లేని రెవెన్యూ అధికారిని నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆ నియామకాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోని 11 బోధనాస్పత్రుల్లో పారిశుధ్యం, భద్రత, బయో మెడికల్ పరికరాల నిర్వహణ, మానవ వనరుల పర్యవేక్షణ వంటి వైద్యేతర పరిపాలనా బాధ్యతల కోసం అడ్మినిస్ర్టేటర్ పోస్టులను సృష్టించినట్టు వాదించింది. ఇందులో నిబంధనల ఉల్లంఘన ఏమీ లేదని స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం సర్వీస్ రూల్స్-2002లో ఎలాంటి సవరణలు చేయకుండా రెవెన్యూ శాఖకు చెందిన అధికారిని నియమించడం చెల్లదని అభిప్రాయపడింది. బీవీ రమణ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
తొలి నుంచి ఇబ్బందే...
ఆస్పత్రిలో ఉన్నతాధికారుల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. దీనివల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆస్పత్రి ఉన్నతాధికారి ఎలా స్పందిస్తారో, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
రైతుబజార్లలో కుళ్లిన ఉల్లి
రాయితీపై కిలో రూ.35కు ఇస్తున్నా అమ్ముడుపోని సరుకు
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
ఉల్లి ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60 పైబడి పలుకుతున్న నేపథ్యంలో రాయితీపై విక్రయించడానికి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా ఉల్లి ధరలు కిలో రూ.60 పైనే పలుకుతున్నాయి. ఒక సమయంలో రూ.80 చొప్పున కూడా విక్రయించారు. దీంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ఉల్లిని రూ.35 చొప్పున విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరులో ఒకసారి మనిషికి రెండు కిలోలు చొప్పున రెండుసార్లు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు నెలలో ఒకసారి పంపిణీ చేశారు. ఇప్పుడు నవంబరు రాగా మళ్లీ ఆదివారం నుంచి వీటిని అమ్ముతున్నారు. ఈసారి వచ్చిన ఉల్లి బాగా పాడైపోయి ఉండడంతో కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. వాస్తవానికి రాయితీ ఉల్లి గతంలో రైతుబజార్లకు వచ్చిన రోజే అమ్ముడైపోయేది. ఎందుకంటే అదే బజారులో షోలాపూర్ ఉల్లి అంటూ కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారు. కిలోకి రూ.15 తక్కువగా ఉండడం వల్ల రాయితీ ఉల్లికి డిమాండ్ ఉంది. కానీ, ఈసారి నాసిక్ నుంచి తెచ్చిన సరకు చిన్నపాయలు, పైగా సగం కుళ్లిపోయి ఉండడంతో ఎవరూ కొనడం లేదు. మహారాష్ట్ర నుంచి గూడ్స్ రైలులో తాడేపల్లిగూడెం వరకు తీసుకువచ్చి, అక్కడి నుంచి లారీలో విశాఖపట్నం పంపించారు. దీపావళి రోజు ఒక్కో బజారుకు 400 నుంచి 650 బస్తాల చొప్పున డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు. ఒక్కో బస్తాలో 50 కిలోలు ఉంటాయి. డ్వాక్రా గ్రూపులకు కిలో ఉల్లి అమ్మితే మూడు రూపాయలు మార్జిన్ మనీగా ఇస్తామని, తరుగు కూడా లెక్కలోకి తీసుకుంటామని మార్కెటింగ్ శాఖాధికారులు హామీ ఇచ్చారు. కానీ ఈసారి ఉల్లి అమ్ముడుపోకపోవడంతో బేరాలు లేవని, జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్ నుంచి యథాప్రకారం తెచ్చి అమ్ముకుంటామని డ్వాక్రా గ్రూపు సభ్యులు కోరుతున్నారు. అధికారులు ముందు రాయితీ ఉల్లి అమ్మేసి, తరువాత ఆ సరకు తెచ్చుకోవాలని చెబుతున్నారు. రాయితీ పేరు చెప్పి నాణ్యత లేని సరకు తెస్తే ఎలాగని వినియోగదారులు విసుక్కుంటున్నారు. ఇకపై నాణ్యత కలిగిన ఉల్లిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.