అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:10 AM
రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా ‘రెండో సందర్శన’గా శుక్రవారం చోడవరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
చోడవరంలో ‘రెండో సందర్శన’
మొదటి సదస్సులో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా
చోడవరం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా ‘రెండో సందర్శన’గా శుక్రవారం చోడవరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత నెల 29వ తేదీన నిర్వహించిన మొదటి సదస్సులో వివిధ సమస్యలపై నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులను ఒక్కొక్కరిగా పిలిచి, సమస్యలను ఎంత వరకూ పరిష్కరించారో అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువ అర్జీలు, ఫిర్యాదులు రావడంతో ఈ వారం రోజుల్లో ఎన్నింటిని పరిష్కరించారని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ సామాజిక కేంద్రంలో సమస్యలతోపాటు వైద్యుల కొరత గురించి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దేవరపల్లి వెంకట అప్పారావు, పప్పు శ్రీను, తదితరులు ఇచ్చిన అర్జీపై తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతిని కలెక్టర్ ఆదేశించారు. భూముల రీసర్వేలో జరిగిన తప్పిదాలపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని అధికారులకు సూచించారు. గత సదస్పులో వచ్చిన 660 ఫిర్యాదులు/ అర్జీల్లో ఎన్నింటిని పరిష్కరించారు, మిగిలిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు, పనిచేసిన కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు కృషి చేయాలని రైతులు, కార్మికుల తరపున పీఎస్‌పేట గ్రామానికి చెందిన దండుపాటి తాతారావు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాగా గత వారంతో పోలిస్తే ఈ వారం తక్కువ మంది ప్రజలు వచ్చారు. విపరీతమైన ఎండలకుతోడు సదస్సు ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాలు రెండో అంతస్థు ఎక్కిదిగేందుకు వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవోలు ఆయీషా, వీవీ రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.