అప్పన్న ఆలయానికి మూడో స్థానం
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:40 AM
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి రాష్ట్రంలో మూడో స్థానం లభించింది.
ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలు
సదుపాయాలు, ప్రసాదాల నాణ్యత ఆధారంగా ర్యాంకులు
సింహాచలం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి రాష్ట్రంలో మూడో స్థానం లభించింది. ప్రతినెలా దేవాలయాల పరిధిలో తాగునీరు, పారిశుధ్యం, ప్రసాదాల నాణ్యత, క్యూల నిర్వాహణ తదితర అంశాలపై భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. గత నెల (జనవరి)లో భక్తులు వ్యక్తీకరించిన అభిప్రాయాల ప్రకారం 76 పాయింట్లతో ద్వారకా తిరుమల దేవస్థానం అగ్రస్థానంలో నిలవగా, 75.1 పాయింట్లతో శ్రీకాళహస్తి రెండు, సింహాచలం దేవస్థానం మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రసాదాల రుచి, నాణ్యత విషయంలో 82.8 పాయింట్లతో, పారిశుధ్య నిర్వాహణలో 70.7 పాయింట్లతో సింహాచల దేవస్థానం అగ్రస్థానంలో ఉంది. దర్శనం విషయంలో మూడు, భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించడంలో ఐదో స్థానంలో ఉంది.
వచ్చే నెల 25న ఏయూ స్నాతకోత్సవం
విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని మార్చి 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో దరఖాస్తు చేసిన వారంతా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు. స్నాతకోత్సవ పట్టాలను స్వీకరించే వారంతా ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి చేరుకుని తమకు కేటాయించిన స్థానంలో కూర్చోవాలని రిజిస్ర్టార్ పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
తొలిరోజు పరీక్షకు 98.47 శాతం హాజరు
మద్దిలపాలెం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. పాఠశాల సిబ్బంది తనిఖీ చేసి లోపలికి అనుమతిచ్చారు. జిల్లావ్యాప్తంగా 85 కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 40,537 మంది (98.47 శాతం) హాజరయ్యారు. కాగా, 629 మంది గైర్హాజరయ్యారు.