పారిశుధ్య నిర్వహణ ఘోరం
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:52 AM
పట్టణంలో పారిశుధ్య నిర్వహణ ఘోరంగా ఉంది. మునిసిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్‌స్వీప్ పేరుతో ఫొటోలకు ఫోజులిస్తూ హడావిడి చేస్తున్నారే తప్ప పరిశుభ్రతపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.
- ఆచరణలో కనిపించని ఆపరేషన్ క్లీన్‌స్వీప్
- అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని విమర్శలు
ఎలమంచిలి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పారిశుధ్య నిర్వహణ ఘోరంగా ఉంది. మునిసిపల్ అధికారులు ఆపరేషన్ క్లీన్‌స్వీప్ పేరుతో ఫొటోలకు ఫోజులిస్తూ హడావిడి చేస్తున్నారే తప్ప పరిశుభ్రతపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.
నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్‌స్వీప్ పేరిట ప్రతిష్ఠాత్మకంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గత నెల 23 నుంచి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎలమంచిలిలో మాత్రం అధికారులు ఆపరేషన్ క్లీన్‌స్వీప్ పేరుతో హడావిడి చేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. పట్టణంలో ఏ వీధి చూసినా చెత్తాచెదారంతో అధ్వానంగా దర్శనమిస్తోంది. స్థానికులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడితే ప్రజారోగ్య విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారే తప్ప పర్యవేక్షణ లేదనే వాదన వినిపిస్తోంది. కొత్తపేటలోని అపార్ట్‌మెంటు వద్ద ప్రధాన రోడ్డుపై గత మూడు రోజులుగా చెత్త పేరుకుపోయినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అలాగే మునిసిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో రోడ్డుపై చెత్త పేరుకుపోయింది. పట్టణంలో ప్రధాన వీధుల్లోనే ఈ దుస్థితి ఉంటే మిగతా చోట్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.