Share News

ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలు పునరుద్ధరణ

ABN , Publish Date - May 23 , 2026 | 12:12 AM

గిరిజన ప్రాంతంలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ కాఫీ తోటలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వయస్సు మీరిన మొక్కలు, కాపు తగ్గిన కావేరి రకాల మొక్కలను తొలగించి మేలిజాతి చంద్రగిరి, సెలక్షన్‌-5 మొక్కలు నాటేందుకు నర్సరీలను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది నూతన మొక్కలను కాఫీ తోటల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నది. గిరిజన ప్రాంతంలో ఏపీఎఫ్‌డీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుటుంది.

ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలు పునరుద్ధరణ
చాపగెడ్డ వద్ద ఏపీఎఫ్‌డీసీ అధికారులు అభివృద్ధి చేస్తున్న చంద్రగిరి, సెలక్షన్‌-5 రకం మొక్కలు

10 లక్షల మేలిజాతి మొక్కల నర్సరీలు అభివృద్ధి

వయస్సు మీరిన మొక్కలు, కావేరి రకం తొలగింపు

రెండు నెలల్లో నాట్లు

గూడెంకొత్తవీధి, మే 22 (ఆంధ్రజ్యోతి):ïÜపాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏపీఎఫ్‌డీసీ 1975 నుంచి కాఫీ సాగు చేపడుతున్నది. నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేసి మన్యం కాఫీ ఘుమఘుమలను ఖండంతరాలకు ఏపీఎఫ్‌డీసీ విస్తరించింది. సంస్థ ఉత్పత్తి చేసిన కాఫీ గింజలకు 12 సార్లు డివిజన్‌, జాతీయ స్థాయిలో ఫైన్‌కప్‌ అవార్డులు వచ్చాయి. అప్పట్లో ఏపీఎఫ్‌డీసీ రికార్డు స్థాయిలో లాభాలను అర్జించింది. ప్రతి ఏటా రూ.22 నుంచి రూ.25 కోట్ల లావాదేవీలు నిర్వహించేది. ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల్లో ఆరు వేల మంది కార్మికులు పనిచేసుకుంటూ ఉపాధి పొందేవారు. కొంత కాలంగా ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల్లో దిగుబడులు తగ్గాయి. దీనికితోడు మావోయిస్టులు కాఫీ తోటలు పంపిణీ చేయడంతో సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏజెన్సీ పది మండలాల్లో మినుములూరు, చింతపల్లి ఉత్తర, దక్షిణం, ఆర్‌వీనగర్‌ తూర్పు, పడమర డివిజన్ల పరిధిలో 4,010 హెక్టార్లలో ఏపీఎఫ్‌డీసీ కాఫీ సాగుచేపడుతోంది.

ఏపీఎఫ్‌డీసీపై మావోయిస్టుల ప్రభావం..

మావోయిస్టుల ఉద్యమం ఏపీఎఫ్‌డీసీపై తీవ్ర ప్రభావం చూపింది. మావోయిస్టులు సంస్థకు చెందిన కాఫీతోటలను ఆదివాసీలకు పంపిణీ చేసేయడంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. మావోయిస్టులు ఏపీఎఫ్‌డీసీ సాగులోనున్న కాఫీ తోటలన్నీ ఆదివాసీలకే చెందాలని 1989 నుంచి ఆందోళ చేస్తూ 1996వ సంవత్సరంలో ఏపీఎఫ్‌డీసీ ఆస్తులపై ప్రత్యక్ష దాడులు ప్రారంభించారు. ఉద్యోగులు తోటలను విడిచి వెళ్లిపోవాలని పలుమార్లు హెచ్చరిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 2012 నుంచి మావోయిస్టు పార్టీ సంస్థకు చెందిన కాఫీతోటలను ఆదివాసీలకి పంపిణీ చేయడం ప్రారంభించింది. ఐదేళ్లలో చింతపల్లి దక్షిణం, ఉత్తర డివిజన్లలో బలపం ప్రాంతంలో 100 హెక్టారులు, పెదవలస ఎస్టేట్‌లో 200 హెక్టారులను ఆదివాసీలకి పంపిణీ చేశారు. అలాగే ఆర్‌వీనగర్‌ తూర్పు, పడమర డివిజన్లలోనూ దాదాపు 600 హెక్టారుల కాఫీ తోటలను ఆదివాసీలకు పంపిణీచేశారు. ప్రస్తుతం ఆర్‌వీనగర్‌ తూర్పు, పడమర డివిజన్ల పరిధిలో మావోయిస్టులు పంపిణీ చేయగా మిగిలిన 1276.26హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతున్నది. మావోయిస్టులు ఆదివాసీలకు పంపిణీచేసిన తోటలను పోలీసుల సహకారంతో తిరిగి స్వాధీనం చేసుకోవాలని గత ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ చర్యలను పూర్తిగా విరమించుకుంది.

కాఫీ తోటలు బలోపేతం

ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలను బలోపేతరం చేసేందుకు ఈ ఏడాది కార్యాచరణ ప్రారంభించింది. 1996 నుంచి ఏపీఎఫ్‌డీసీ కావేరి రకం మొక్కలను నాటడం జరిగింది. ఈ మొక్కలు ప్రస్తుతం దిగుబడులు ఇవ్వడం లేదు. అలాగే ఏపీఎఫ్‌డీసీ తోటల్లో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు వయస్సు మీరిపోవడం వల్ల ఆశించి దిగుబడులు రావడం లేదు. దీంతో కాఫీ తోటలను పునరుద్ధరించేందుకు వయస్సు మీరిన మొక్కలు, కావేరి రకం మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్‌వీనగర్‌, చింతపల్లి ప్రాంతాల్లో చంద్రగిరి, సెలక్షన్‌-5 రకం కాఫీ మొక్కల నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. హెక్టారుకి 1,850 మొక్కలు నాటనున్నారు. ఏపీఎఫ్‌డీసీ ఐదు డివిజన్ల పరిధిలో పది లక్షల మొక్కలను పెంచుతున్నది. అలాగే నీడనిచ్చేందుకు మారుజాతి మొక్కల నర్సరీలను సైతం పెంచుతున్నారు. రెండు నెలల్లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే ఈ మొక్కలను తోటల్లో నాటుతామని ఏపీఎఫ్‌డీసీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో గతంలో మాదిరిగా దిగుబడులు సాధించడంతోపాటు ఆదివాసీలకు కాఫీ తోటల ద్వారా ఉపాధి కల్పించేందుకు ఏపీఎఫ్‌డీసీ ముందడుగు వేస్తున్నది.

Updated Date - May 23 , 2026 | 12:12 AM