2035 నాటికి హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్‌గా ఏపీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:22 AM
యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడమే ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలతోపాటు ఆరోగ్యం, ఆనందం,
ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడం ప్రభుత్వ బాధ్యత
‘యంగ్ ఆంధ్ర..థ్రైవింగ్ ఆంధ్ర’లో మంత్రి నారా లోకేష్
మహిళల ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఉపాసన కొణిదెల ప్రశ్నలు
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడమే ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2035 నాటికి ఏపీని దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘యంగ్ ఆంధ్ర..థ్రైవింగ్ ఆంధ్ర-ఆరోగ్యం, ఆనందం, మానవ సామర్థ్యంపై కొత్త సంభాషణ’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్, యూఆర్ లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన కొణిదల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్య, ఉపాధి, మహిళా సాధికారిత, కుటుంబ విలువలు, సాంకేతికత, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం తదితర అంశాలపై ఉపాసన అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు.
తొలుత ఉపాసన రాష్ట్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆధ్యాత్మిక యాత్ర అనగానే ప్రతి ఒక్కరికీ ఏపీ గుర్తుకువచ్చేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. తిరుపతి బాలాజీతోపాటు తన తాత (అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి) స్వస్థలమైన చిత్తూరుతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. లోకేష్ తాత ఆత్మగౌరవం కోసం నిలబడితే, తన తాత వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఏపీ అనేకసార్లు పునఃప్రారంభం కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టే ప్రక్రియలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందన్నారు. ఉపాసన తాత ఇప్పటికీ అదే ఉత్సాహంతో వైద్య రంగానికి సేవలు అందించడం తనకు స్ఫూర్తినిస్తోందన్నారు. అనారోగ్య సమస్య వచ్చిన తరువాతే వైద్యులను సంప్రతించే బదులుగా..షుగర్, బీపీ వంటి సమస్యల విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకునేలా యువతలో అవగాహన కల్పించాలన్నారు.
నర్సులకు భారీగా డిమాండ్
ప్రపంచ వ్యాప్తంగా 58 లక్షల మంది నర్సులు అవసరం ఉందని, ఈ కొరతను తగ్గించడంలో ఏపీ కీలకపాత్ర పోషించవచ్చునని ఉపాసన పేర్కొన్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఎక్కడెక్కడ కొరత ఉంది, యువతను ఈ రంగంలోకి ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై సలహా తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు.
పిల్లల సంరక్షణ సదుపాయాలపై..
మాతా, శిశు మరణాల రేటు తగ్గడం మంచి పరిణామమని, అయినా చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఉపాసన తెలిపారు. పిల్లలు పుట్టిన తరువాత సంరక్షణ బాధ్యతల కారణంగా చాలామంది మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకురావడానికి ఏం చేయాలనే అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ..కంపెనీలు మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఫ్యాక్టరీల్లోనూ, మహిళలకు అవకాశాలు పెరగాలన్నారు. పనిచేసే చోటే పిల్లల సంరక్షణకు సదుపాయాలు కల్పిస్తే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజకీయాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోందన్న లోకే్‌ష..తాజాగా జరిగిన ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు.
కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమా.?
ఒక మంత్రిత్వశాఖ నిర్వహించడం కష్టమా?, ముగ్గురు పిల్లలను చూసుకోవడం కష్టమా.?...అని ఉపాసన ప్రశ్నించగా, కుటుంబానికి సమయం కేటాయించడమే తనకు అన్నింటికంటే కష్టమని లోకేష్ పేర్కొన్నారు. చదువు, ఉద్యోగాల కారణంగా తాను, బ్రాహ్మిణి కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చిందని, అవకాశం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు యత్నిస్తానన్నారు. దేవాన్ష్ డైనోసార్ పాడ్‌కా్‌స్టలో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడని ఉపాసన ప్రస్తావించగా, అతను సినిమాల్లోకి వెళతాడేమోనని తాను ఆందోళన చెందుతున్నట్టు లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఉపాసన తన తాతకు 90 ఏళ్లు దాటినా ప్రతిరోజూ ఫోన్ చేసి ‘ఈరోజు నువ్వు చేసిన మంచి పని ఏంటి.?’ అని అడుగుతారని..ఆ ప్రశ్న రోజూ ఏదో ఒక మంచి పనిచేయాలనే స్ఫూర్తిని ఇస్తుందన్నారు.