లంబసింగిలో ఏపీ సమాచారశాఖ కమిషనర్ పర్యటన
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:48 PM
పర్యాటక ప్రాంతమైన లంబసింగిని ఏపీ సమాచారశాఖ కమిషనర్ చావలి సునీల్ సందర్శించారు. శనివారం సాయంత్రం లంబసింగి చేరుకున్న ఆయన పర్యాటకశాఖ హరిత రిసార్ట్స్‌లో బస చేశారు.
చింతపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన లంబసింగిని ఏపీ సమాచారశాఖ కమిషనర్ చావలి సునీల్ సందర్శించారు. శనివారం సాయంత్రం లంబసింగి చేరుకున్న ఆయన పర్యాటకశాఖ హరిత రిసార్ట్స్‌లో బస చేశారు. ఆదివారం ఉదయం లంబసింగి పరిసర గిరిజన గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో ముచ్చటించారు. గిరిజనుల జీవన విధానం, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి వున్నారా?, సమాచారం ఏ స్థాయిలో అందుతుందని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం తాజంగి జలాశయంలో బోటింగ్ చేశారు. సాహస క్రీడ జిప్‌లైన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబసింగి ప్రకృతి అందాలు ఆకర్షణీయంగా వున్నాయన్నారు. పచ్చని అడవులు, కాఫీ తోటలు, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన ప్రాంతమన్నారు. లంబసింగి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆయన వెంట స్థానిక ఉప తహశీల్దార్‌లు నరేంద్ర, బాలన్నదొర, వీఆర్వో వి.సదానందరావు, ఆర్‌ఐ కృష్ణమూర్తి, పోలీసులు ఉన్నారు.