Share News

సరిహద్దులో నిఘా ఏదీ?

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:51 PM

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలిపే జోలాపుట్టు జలాశయంపై నిఘా కొరవడింది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే ఇరు రాష్ట్రాల వాహనాల తనిఖీ ఆగిపోయింది. దీంతో ముంచంగిపుట్టు, పెదబయలు, అరకు, డుంబ్రిగుడ, పాడేరు, జి. మాడుగుల, తదితర మండలాల్లో దొంగతనాలు జోరందుకున్నాయి.

సరిహద్దులో నిఘా ఏదీ?
జోలాపుట్టు జలాశయంపై వాహన మార్గంలో తెరిచి ఉంచిన గేట్లు(ఫైల్‌ఫొటో)

జోలాపుట్టు జలాశయంపై కానరాని వాహన తనిఖీలు

యథేచ్ఛగా రాకపోకలు

పెరుగుతున్న దొంగతనాలు

ముంచంగిపుట్టు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్టు రిజర్వాయర్‌పై గత కొద్ది రోజులుగా వాహన తనిఖీలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వచ్చే వాహనాల నంబర్లను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నదీ.. వారి వివరాలను అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఒక రికార్డులో నమోదు చేసుకునేవారు. అయితే గత కొద్ది రోజులుగా రెండు జలాశయంపై ఉన్న మార్గంలోని గేట్లు నిత్యం తెరిచే ఉంటున్నాయి. రాత్రీ, పగలు తేడా లేకుండా అటుగా వాహన రాకపోకలు జరుగుతున్నా కనీసం తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. దీంతో ఒడిశాకు చెందిన దొంగలు ఆంధ్రా భూ భాగంలోకి సులువుగా చొరబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఒడిశాకు చెందిన ద్విచక్ర వాహన దొంగల ముఠా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముంచంగిపుట్టు, పెదబయలు, అరకు, డుంబ్రిగుడ, పాడేరు, జి.మాడుగుల తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆంధ్రా పోలీసులు చాకచక్యంగా అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని విచారించగా.. దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను జోలాపుట్టు సరిహద్దు వంతెనపై నుంచే ఒడిశాకు తరలిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో కొన్ని రోజులుపాటు సరిహద్దు వంతెనల వద్ద తనిఖీలు సక్రమంగా చేపట్టిన గార్డులు ప్రస్తుతం మొక్కుబడిగా చేస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు ఆంధ్రాలో దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఒక ఇంటిని దొంగలు లూటీ చేయడంతోపాటు వివిధ ప్రాంతాల్లో మూడు ద్విచక్ర వాహనాలను ఎత్తుకుపోయారు. మరిన్ని దొంగతనాలు జరగకుండా ఇరురాష్ట్రాల అధికారులు స్పందించి సరిహద్దు ప్రాంతాలను కలిపే వంతెనల వద్ద తనిఖీలు సక్రమంగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:52 PM