Share News

అన్నదాతల్లో గుబులు

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:02 AM

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుఫాన్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు వారాల క్రితం ఆర్నబ్‌, ఈ నెల మొదటి వారంలో మురసు తుఫాన్ల ప్రభావంతో జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆయా సమయాల్లో వరి పంట కోతకు రాకపోవడంతో కొద్దిపాటి నష్టమే వాటిల్లింది.

అన్నదాతల్లో గుబులు
మాడుగల మండలం జంపెనలో కోతకు వచ్చిన వరి పైరు

చేతికి వచ్చిన వరి పంట తుఫాన్‌ పాలవుతుందేమోనని ఆందోళన

ఇప్పటికే కోత కోసిన పొలాల్లో ఆదరాబాదరాగా కుప్పలు

మాడుగుల రూరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుఫాన్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు వారాల క్రితం ఆర్నబ్‌, ఈ నెల మొదటి వారంలో మురసు తుఫాన్ల ప్రభావంతో జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆయా సమయాల్లో వరి పంట కోతకు రాకపోవడంతో కొద్దిపాటి నష్టమే వాటిల్లింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతం నెలకొన్న తుఫాన్‌.. మరో రెండు రోజుల్లో తీవ్రరూపం దాల్చి, ఈ నెల 20వ తేదీన విశాఖ- కాకినాడ మధ్య తీరం దాటుతుందని, బుధవారం నుంచే జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గంలో వరి పంట గింజ గట్టిపడే దశ నుంచి కోత దశకు వరకు వుంది. ముందుగా వరినాట్లు వేసిన పొలాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభించారు. మాడుగుల మండలంలో పెద్దేరు, తాచేరు జలాశయాలతోపాటు చెరువుల కింద సుమారు 12 వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం గాదిరాయి, సత్యవరం, సాగరం తదితర గ్రామాల్లో ఇంతవరకు దాదాపు 500 ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. మరో ఐదు వేల ఎకరాల్లో వారం నుంచి పది రోజుల్లో కోత కోయాల్సి వుంది. ఈ నేపథ్యంలో తుఫాన్‌ హెచ్చరికలతో ఆయా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోత కోసిన రైతులు.. వరి పనలను మోపులు కట్టి, కల్లాల వద్దకు చేరుస్తున్నారు. ఇప్పటికే కుప్పలు వేసిన రైతులు.. వర్షాలకు తడిసిపోకుండా వుండేందుకు టార్పాలిన్లు కప్పుతున్నారు.

కాగా వరి పంట పండిన పొలాల్లో కోతలను తుఫాన్‌ ప్రభవం తగ్గే వరకు వాయిదా వేసుకోవాలి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల క్రితం వరి పంటను కోసి వుంటే వెంటనే పొలంలోనే కొంచెం ఎత్తయిన ప్రదేశాల వద్ద చిన్నపాటి కుప్పలుగా వేసుకొని, వర్షానికి తడవకుండా పైన ప్లాస్టిక్‌ పట్టలు కప్పుకొని, గాలికి ఎగిరిపోకుండా తాళ్లతో కట్టుకోవాలన్నారు. వరి పొలాల్లో నీరు అధికంగా నిల్వ ఉండకుండా బయటకు పంపించాలని, ఈదురు గాలులకు వరి పైరు నేలకొరిగితే.. వర్షాలు తగ్గిన తరువాత మూడు, నాలుగు దబ్బులను కలిపి నిలబెట్టుకుని వరి పరకలతో కట్టుకోవాలని చెప్పారు.

Updated Date - Nov 18 , 2026 | 01:02 AM