కన్నుల పండువగా అనుపోత్సవం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:59 PM
ముత్యాలమ్మ అనుపోత్సవం కన్నుల పండువగా సాగింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సాయిబాబా ఆలయం నుంచి సుర్లవారి స్థావరాల వరకు భారీ ఊరేగింపుగా సాగింది.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
చింతపల్లి, ఏప్రిల్ 17 (ఆంరఽధజ్యోతి): ముత్యాలమ్మ అనుపోత్సవం కన్నుల పండువగా సాగింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సాయిబాబా ఆలయం నుంచి సుర్లవారి స్థావరాల వరకు భారీ ఊరేగింపుగా సాగింది. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు సుర్లవారి స్థావరంలో ముత్యాలమ్మ పాదాలు(గరగలు)కు అర్చకుడు సుర్ల అప్పారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పాదాలను పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ కోరాబు అనూషదేవి, ముత్యాలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజు బాలయ్య, భక్తులు శిరస్సుపై మోసుకుంటూ భారీ ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారి పాదాలకు భక్తులు పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో ప్రదర్శించిన విభిన్న వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ముత్యాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముత్యాలమ్మ జాతర చివరి రోజు శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం జాతర ముగింపు, గంధామవాస్య కావడంతో ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడి ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు డప్పు వాయిద్యాలతో సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అర్చకుడు సుర్ల అప్పారావు, జగన్ భక్తులతో పూజలు చేయించి అభిషేకాలు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
ముత్యాలమ్మను పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏపీ జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు, పాడేరు ఏఎంసీ చైర్మన్ డప్పొడి వెంకటరమణ, స్థానిక ప్రథమ శ్రేణి కోర్టు మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎం.రోహిత్, ఎంపీపీలు కోరాబు అనూషదేవి, బోయిన కుమారి (జీకేవీధి), తాజా మాజీ సర్పంచ్ దురియా పుష్పలత, ఏంఎసీ మాజీ చైర్మన్ బొర్ర విజయరాణి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.నీలవేణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రముఖులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సుర్ల వీరేంద్ర, పైలా శ్రీను, తాడి రమణ, తాటిపాకల రమేశ్, నాగేశ్వరరావు, గంజారి రమణ, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, అరకు పార్లమెంట్ సోషల్‌మీడియా కో-ఆర్డినేటర్ సోమేశ్ పాల్గొన్నారు.