Share News

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:23 AM

ద్వారకా నగర్‌లోని ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు

రాత్రివేళ మద్యం, గంజాయి సేవించి యువకుల హల్‌చల్‌

మహిళా ఎస్‌ఐపై తిరగబడిన యువకులు

రక్షణగా వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌పైనా దాడి

పోలీసుల అదుపులో ఇద్దరు

మహారాణిపేట, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

ద్వారకా నగర్‌లోని ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. మందుబాబులు, గంజాయి, మత్తు పదార్థాలు సేవించేవారు, వ్యభిచారుల సంచారంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆకతాయి చేష్టలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారిని ఎదుర్కొనలేక చాలామంది తలవంచుకుని వెళ్లిపోతున్నారు. ఆర్‌టీసీ అవుట్‌ గేట్‌ వద్ద ప్రయాణికుల ముసుగులో కొందరు యువకులు హల్‌చల్‌ చేస్తున్నారు. ఒంటరిగా వచ్చే ప్రయాణికులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐపైనే తిరగబడ్డారు. రక్షణగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌, సిబ్బందిని కొట్టారు.

మహిళా ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆర్‌టీసీ కాంప్లెక్సులో తనిఖీలు చేస్తున్నారు. అవుట్‌ గేట్‌ సమీపంలో ఆరుగురు మద్యం మైకంలో గొడవ చేస్తుండడం చూసి...వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు ఎస్‌ఐపై తిరగబడ్డారు. కొంత గొడవ జరగడంతో సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకోగా, వారిపై ఆ యువకులు దాడికి దిగారు. పక్కనే ఉన్న లలితా నగల దుకాణం అద్దాలను పగులగొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారవుతుండగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల కట్టడికి అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:23 AM