Share News

ఏడాదైనా పూర్తికాని ‘యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌’ పార్క్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 01:18 AM

‘యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్క్‌’కు శంకుస్థాపన జరిగి ఏడాదైనా ఇంకా ఆపసోపాలు పడుతోంది.

ఏడాదైనా పూర్తికాని ‘యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌’ పార్క్‌

సిటీ సెంట్రల్‌ పార్కులో రూ.3.5 కోట్లతో నిర్మాణానికి గత అక్టోబరులో శంకుస్థాపన

ఈ ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):

‘యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్క్‌’కు శంకుస్థాపన జరిగి ఏడాదైనా ఇంకా ఆపసోపాలు పడుతోంది. వీఎంఆర్‌డీఏ సిటీ సెంట్రల్‌ పార్కులో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.5 కోట్లతో ఈ పార్క్‌ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు గత ఏడాది అక్టోబరులో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. యువతకు దిశా నిర్దేశం చేయడానికి వినూత్నమైన ఆలోచనతో థీమ్‌ పార్క్‌ నిర్మించడం మంచి ఆలోచన అని, ఇది విశాఖలో ప్రత్యేకంగా ఉంటుందని అంతా ప్రశంసించారు. యాంటీ డ్రగ్‌ పార్క్‌ అనేది ప్రపంచంలో ఇదే మొదటిదని కూడా ప్రకటించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని ఈ విధంగా మరింత ముందుకు తీసుకువెళుతున్నామని వీఎంఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. అయితే కాంట్రాక్టర్‌కు తగిన బిల్లులు మంజూరు చేయకోపోవడం వల్లనే ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు నాటికే పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో పనులు ఆగిపోయాయని, బిల్లు మంజూరుచేస్తే వాటిని పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది.


ఆర్టీసీ స్పెషల్స్‌ 27...

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

దసరాకు స్వస్థలాలకు వచ్చి, తిరుగు ప్రయాణమైన వారి కోసం శుక్రవారం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ 27 ప్రత్యేక బస్సులు నడిపింది. హైదరాబాద్‌కు 6, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు 8, భీమవరం 2 సర్వీసులు నడిపింది. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన సాధారణ భక్తుల కోసం 5, బందోబస్తు నిమిత్తం వెళ్లిన పోలీసులను తీసుకువచ్చేందుకు ఆరు ప్రత్యేక సర్వీసులు నడిపింది.

Updated Date - Oct 23 , 2026 | 01:18 AM