జిల్లాకు మరో స్టీల్ ప్లాంట్
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:53 AM
మండలంలో భారీ స్టీల్ కంపెనీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పరిశ్రమలకు కేటాయించేందుకు అధికారులు ల్యాండ్ బ్యాంకుగా గుర్తించిన భూములను మంగళవారం జపాన్‌కు చెందిన ఒక స్టీల్ కంపెనీ బృందం, అధికారులతో కలిసి ఇక్కడకు వచ్చి పరిశీలించింది. స్టీల్ కంపెనీ ఏర్పాటుకు సమారు వెయ్యి ఎకరాలు అవసరమని ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది.
మాకవరపాలెం మండలంలో ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న జపాన్ కంపెనీ
రూ.50 వేల కోట్ల పెట్టుబడితో వెయ్యి ఎకరాల్లో నిర్మాణం
తూటిపాల రెవెన్యూలో భూముల పరిశీలన
మాకవరపాలెం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో భారీ స్టీల్ కంపెనీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పరిశ్రమలకు కేటాయించేందుకు అధికారులు ల్యాండ్ బ్యాంకుగా గుర్తించిన భూములను మంగళవారం జపాన్‌కు చెందిన ఒక స్టీల్ కంపెనీ బృందం, అధికారులతో కలిసి ఇక్కడకు వచ్చి పరిశీలించింది. స్టీల్ కంపెనీ ఏర్పాటుకు సమారు వెయ్యి ఎకరాలు అవసరమని ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది.
మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామల్లో 4,250 ఎకరాలను భూమిని రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ఇప్పటికే ల్యాండ్ బ్యాంకుగా గుర్తించారు. వీటిల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం గత కొన్ని నెలల నుంచి పలు ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు వచ్చి భూములను చూసి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నదని ఇటీవల చామంతిపురం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం జపాన్‌కు చెందిన ఒక బృందం స్టీల్ కంపెనీ ఏర్పాటు కోసం తూటిపాల రెవెన్యూ అడిగర్లపాలెం గ్రామంలో ల్యాండ్ బ్యాంకు భూములను పరిశీలించారు. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీల్ కంపెనీకి దాదాపు 1,000 ఎకరాలు అవసరమని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా అడిగర్లపాలెం, మామిడిపాలెం గ్రామాలను ఆనుకొని ఉన్న రిజర్వాయర్‌ను, జాజిగెడ్డను పరిశీలించారు. తూటిపాల రెవెన్యూ అడిగర్లపాలెంలోని ల్యాండ్ బ్యాంకు భూములకు నీరు, విద్యుత్తు, రహదారులు వంటి సదుపాయాల గురించి అధికారులను అడిగారు. ఇక్కడ స్టీల్ కంపెనీ ఏర్పాటుకు జపాన్ బృందం ఆసక్తి చూపుతున్నట్టు ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు.
కాగా ఇటీవల బ్లాక్‌స్టోన్ కంపెనీ ప్రతినిధులు తూటిపాల రెవెన్యూ పరిధిలోని ల్యాండ్ బ్యాంకు భూములను (ప్రస్తుతం జపాన్ ప్రతినిధుల బృందం చూసిన భూములు) పరిశీలించి 500 ఎకరాలు అవరమని చెప్పారు. అయితే ఇప్పుడు స్టీల్ కంపెనీ ఏర్పాటు కోసం తమకు వెయ్యి ఎకరాలు అవసరమని జపాన్ బృందం చెప్పడంతో.. బ్లాక్‌స్టోన్ కంపెనీకి రాచపల్లి రెవెన్యూ పరిధిలో 500 ఎకరాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఇదిలావుండగా పైడిపాల రెవెన్యూ పరిధిలో 150 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటుకు సర్వే చేస్తున్నారు.