Share News

ఏయూలో మళ్లీ రగడ

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:24 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.

ఏయూలో మళ్లీ రగడ

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ ఆందోళన

విభాగాల్లో ఎస్‌ఎఫ్‌ఐ కరపత్రాలు పంపిణీ చేయడంపై ఏబీవీపీ అభ్యంతరం

మరోసారి ఇరు సంఘాలకు చెందిన నేతల తోపులాట

రిజిస్ర్టార్‌కు పరస్పరం ఫిర్యాదులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గడిచిన కొద్దిరోజులుగా ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ/ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. ఏబీవీపీకి చెందిన నేతలు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఎస్‌ఎఫ్‌ఐ/ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఏయూ వీసీ కార్యాలయం ఎదుట ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. తప్పు చేసిన వారిపై చర్య తీసుకుంటామని, ఈ తరహా చర్యలకు స్వస్తి చెప్పాలని ఇరు సంఘాల నేతలకు వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో గొడవ సర్దుమణిగిందని అంతా భావించారు. అయితే, తమపై దాడికి పాల్పడిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ గోపి, జిల్లా కన్వీనర్‌ నితిన్‌, నగర కార్యదర్శి ప్రసాద్‌తోపాటు పలువురు శుక్రవారం ఉదయం ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ గూండాలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ గూండాల పేరుతో తయారుచేసిన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏబీవీపీ నాయకులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఏబీవీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఏయూ ఆర్ట్స్‌ కాలేజీ పరిధిలోని పాలిటిక్స్‌ విభాగంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలియడంతో అక్కడకు వెళ్లి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల నాయకులు వేర్వేరుగా రిజిస్ర్టార్‌ను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వినతులు సమర్పించారు. వారి వాదనలు విన్న రిజిస్ర్టార్‌ తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఏయూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఇమ్మాన్యుయల్‌ రాజీనామా చేశారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రిజిస్ర్టార్‌ కె.రాంబాబు వెల్లడించారు.

వివాదాల్లో తలదూర్చవద్దు: రిజిస్ర్టార్‌

విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని, సామర్థ్యాలను కెరియర్‌ను నిర్మించుకునే దిశగా వినియోగించాలని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు సూచించారు. విద్యార్థి సంఘాల గొడవల నేపథ్యంలో ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలో ఉన్న గ్రంథాలయం, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. విద్యార్థులు తెలిసో,తెలియకో వివాదాల్లో భాగం అయితే భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నట్టేనన్నారు. విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో బయట వ్యక్తులు నేరుగా జోక్యం చేసుకోవద్దని, సమస్య ఉంటే వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బయట వ్యక్తుల ప్రభావానికి విద్యార్థులు లోను కావద్దన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:24 AM