Share News

మరో పోలీసు సబ్‌డివిజన్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:21 AM

జిల్లాలో మరో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడల్లో డీఎస్పీ కార్యాలయాలు వుండగా, అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా నాలుగో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఏయే పోలీసు స్టేషన్లను దీని పరిధిలోకి తీసుకురావాలన్నదానిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త డివిజన్‌ ఏర్పాటు కోసం సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను ఇప్పటికే హోం శాఖకు పంపించారు.

మరో పోలీసు సబ్‌డివిజన్‌
ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో ప్రస్తుతం ఉన్న నక్కపల్లి పోలీసు సర్కిల్‌ కార్యాలయం

అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందించిన జిల్లా అధికారులు

ఇప్పటికే అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడల్లో డీఎస్పీ కార్యాలయాలు

అడ్డురోడ్డులో ఏర్పాటైతే నాలుగుకు పెరుగున్న పోలీసు సబ్‌డివిజన్లు

మరింత మెరుగ్గా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మరో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడల్లో డీఎస్పీ కార్యాలయాలు వుండగా, అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా నాలుగో పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఏయే పోలీసు స్టేషన్లను దీని పరిధిలోకి తీసుకురావాలన్నదానిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త డివిజన్‌ ఏర్పాటు కోసం సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను ఇప్పటికే హోం శాఖకు పంపించారు.

పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రెవెన్యూ పరంగా పరిపాలన సౌలభ్యం కోసం అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ను మంజూరు చేసిన విషయం తెలిసింది. స్థానిక (తిమ్మాపురం) పంచాయతీ కార్యాలయ భవనంలో గత నెల 31వ తేదీన ప్రారంభించారు. దీంతో జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య మూడుకు పెరిగింది. పరిశ్రమల ఏర్పాటుతో శాంతి భద్రతల పరంగా పలు సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ పటిష్టంగా వుండాలి. ఇందుకోసం అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా నూతన పోలీసు సబ్‌డివిజన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడుని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించడంతో జిల్లా అధికారులు తగు చర్యలు చేపట్టారు. అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా కొత్త పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా నేతృత్వంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అధికారుల సమాచారం ప్రకారం కొత్త పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలో కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పోలీసు స్టేషన్లు వుండే అవకాశం వుంది. పోలీసు సబ్‌డివిజన్‌ కార్యాలయం ఏర్పాటైతే ఇందులో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు, హెచ్‌సీలు, పీసీలతోపాటు కార్యాలయ పరిపాలన సిబ్బంది ఉంటారు. ఆయా పోస్టులను కేటాయించేందుకు జిల్లా పోలీసు శాఖ నుంచి హోం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. అడ్డరోడ్డు జంక్షన్‌లో పోలీసు సబ్‌డివిజన్‌ కార్యాలయం ఏర్పాటుతో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరింత మెరుగ్గా వుంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

Updated Date - Jan 23 , 2026 | 12:21 AM