Share News

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:12 AM

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానున్నది.

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

అచ్యుతాపురం సెజ్‌లో ‘బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌’ కంపెనీ

102.48 ఎకరాలు కేటాయింపు, రూ.2,300 కోట్ల పెట్టుబడి

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి

ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్‌?

పరవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానున్నది. ‘బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన జరగనున్నట్టు తెలిసింది. ఏపీఐఐసీ అధికార వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోని రాంబిల్లి మండల పరిధి ఏపీఐఐసీ ఫేజ్‌-2లో 102.48 ఎకరాలను ఈ ఫార్మా కంపెనీకి కేటాయించారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం పది గంటలకు శంకుస్థాపన వుంటుందని ఏపీఐఐసీ అచ్యుతాపురం సెజ్‌ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ కూండ్రపు సూర్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తోపాటు పలువురు మంత్రులు హాజరవుతారని వెల్లడించారు. బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి లభించనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.


లీటరుకు రూ.2

పాల అమ్మకం ధరలను పెంచిన విశాఖ డెయిరీ

నేటి నుంచి అమల్లోకి కొత్త ధరలు

వినియోగదారులపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం

అక్కిరెడ్డిపాలెం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

పాల అమ్మకం ధరలను పెంచుతూ విశాఖ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో లీటరుకు రెండు రూపాయల మేర పెంచడంతో వినియోగదారులపై రోజుకు రూ.10 లక్షల మేర అదనపు భారం పడనుంది. పెరిగిన పాల ధరల పట్టికలను ఇప్పటికే అమ్మకందారులకు డెయిరీ యాజమాన్యం పంపింది. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. సవరించిన ధరల ప్రకారం హోమోజినైజ్డ్‌ డబుల్‌ టోన్డుపాలు 500 అర లీటరు రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్‌ టోన్డు పాలు రూ.28 నుంచి రూ.29కి, టోన్డు పాలు రూ.28 నుంచి రూ.29కి, స్టాండర్‌డైౖజ్డ్‌ పాలు 500 రూ.31 నుంచి రూ.32కి, పుల్‌క్రీమ్‌ పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కి, హోమోజనైజ్డ్‌ టోన్డు పాలు (గంగ) రూ.28 నుంచి రూ.29కి, డబుల్‌ టోన్డు పాలు (గంగ) రూ.26 నుంచి రూ.27కు పెంచారు. పెరుగు, ఇతర ఉపఉత్పత్తులపై ధరలు ప్రస్తుతం పెంచలేదు. కాగా గత ఏడాది మే 10న లీటరు పాలపై రెండు రూపాయల మేర పెంచిన విశాఖ డెయిరీ యాజమాన్యం.. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.2 చొప్పున పెంచింది. విశాఖ డెయిరీ రోజుకు సుమారు ఐదు లక్షల లీటర్లు పాలను విక్రయిస్తున్న. పెంచిన ధరల ప్రకారం వినియోగదారులపై సుమారు రూ.10 లక్షల అదపు భారం పడనుంది.

Updated Date - Feb 16 , 2026 | 01:12 AM