మరో భారీ డేటా సెంటర్
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:07 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన క్యేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
100 మెగావాట్ల సామర్థ్యం.. రూ.2,788.3 కోట్ల పెట్టుబడి
49.93 ఎకరాలు కేటాయింపు
లోవగవరవరంలో సీబీజీ ప్లాంట్
అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయానికి 17 పోస్టులు మంజూరు
మంత్రిమండలి సమావేశంలో ఆమోదం
అనకాపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన క్యేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సిఫారసుల మేరకు అనకాపల్లి జిల్లాలో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ డేటా కేంద్రాన్ని స్థాపించేందుకు ‘కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్’ సంస్థకు 49.93 ఎకరాలను కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సుమారు రూ.2,788.3 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్‌లో 160 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ డేటా సెంటర్ స్థాపన ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలను ఈ డేటా సెంరట్ గణనీయంగా బలోపేతం చేస్తుంది. దీనివల్ల నిర్మాణ, తయారీ రంగాలు, ఐటీ సేవల రంగాల్లో పెద్దఎత్తున పరోక్ష ఉపాధి లభిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేథా ఆధారిత సామర్థ్యాల లభ్యత వల్ల స్థానిక ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి. స్థానిక సంస్థలకు సాధికారత లభిస్తుంది. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగి, సుస్థిర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిచ్చేలా ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024’ నిబంధనల ప్రకారం మాడుగుల మండలం జమ్మాదేవిపేట పంచాయతీ లోవగవరవరం గ్రామంలో రోజుకు 15 టన్నుల (15 టీపీడీ) సామర్థ్యం గల కంప్రెస్ట్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను నెలకొల్పేందుకు మెసర్స్ ఆంధ్రా బయో ఎనర్జీ పైవ్రేట్ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు సదరు పాలసీ ప్రకారం వర్తించే ప్రోత్సాహకాలను పొడిగించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పంట అవశేషాలు, పశువుల వ్యర్థాలను వినియోగించి ఇంధనం ఉత్పత్తి చేయడం ద్వారా స్థానిక రైతులకు అదనపు అదాయం లభించే అవకాశాలున్నాయి.
అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి 17 పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డివిజన్‌లో రెవెన్యూ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. జిల్లాలోని గిరిజన ప్రాంతాల పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏపీ ఏజెన్సీ నిబంధనల్లో సవరణలు చేస్తూ జిల్లాలో గిరిజన సబ్ ప్లాన్ ప్రాంతాలపై కలెక్టర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ మంత్రి మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది.