Share News

కైలాసగిరికి మరో ఘాట్‌ రోడ్డు

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:16 AM

కైలాసగిరికి సందర్శకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతిపాదించిన రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణంపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. ఆయన శనివారం కైలాసగిరి, తొట్లకొండ ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. కైలాసగిరిపై ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నింటినీ అడిగి తెలుసుకున్నారు.

కైలాసగిరికి మరో ఘాట్‌ రోడ్డు
కైలాసగిరిపై అధికారులకు సూచనలు చేస్తున్న కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

ఎనర్జీ పార్కు ఏర్పాటుకు చర్యలు

25 గదులతో రిసార్ట్‌

వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి

కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరికి సందర్శకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతిపాదించిన రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణంపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. ఆయన శనివారం కైలాసగిరి, తొట్లకొండ ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. కైలాసగిరిపై ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, దానికి తగిన స్థలం కేటాయించాలని సూచించారు. కొండపైకి ఒకే రహదారి ఉండడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నందున ప్రత్యామ్నాయంగా రెండో మార్గం అవసరమని, ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. పర్యాటకులు విడిది చేసేందుకు చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడం గమనించి అధికారులను ప్రశ్నించారు. విశాఖలో పర్యాటకులకు అవసరమైనన్ని గదులు లేవని, మొత్తం 25 గదులు వచ్చేలా రిసార్ట్‌ నిర్మాణం ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. నగరంలోని ప్రముఖ హోటళ్ల యజమానులతో చర్చించి, వారి సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. కైలాసగిరిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని, మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేయాలని ఆదేశించారు. ఆ తరువాత తొట్లకొండకు వెళ్లి, అక్కడ వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేయాలని భావిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. బీచ్‌రోడ్డును ఆనుకొని ప్రజలు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. అక్కడి నుంచి వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లను పరిశీలించారు. మౌలిక వసతులు, ప్రతిపాదిత పనులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సెక్రటరీ మురళీకృష్ణ, ఈఓ దయానిధి, సీఈ వినయకుమార్‌, డీఎఫ్‌ఓ రమణమూర్తి, అదనపు కార్యదర్శి రిషిబాబు, ఏఓ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 01:17 AM