ప్రైవేటుకు మరో విభాగం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:37 AM
లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంటు యాజమాన్యం విభాగాల ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం ఆపలేదు.
క్యాప్టివ్ పవర్ ప్లాంటు నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించిన స్టీల్‌ప్లాంటు
రెండేళ్లకు రూ.83.52 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంటు యాజమాన్యం విభాగాల ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం ఆపలేదు. ఆర్థిక సంస్కరణల పేరిట నిర్వహణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది ఆగస్టులో క్యాప్టివ్ పవర్ ప్లాంటు (సీపీపీ)ని ప్రైవేటుకు ఇస్తామని ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీచేసింది. ఇప్పుడు రెండేళ్ల నిర్వహణకు రూ.83.52 కోట్లు చెల్లిస్తామని, సమర్థులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని నోటిఫికేషన్ ఇచ్చింది.
స్టీల్ ప్లాంటుకు విద్యుత్ వ్యయం చాలా ఎక్కువ. అందుకని సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేసుకుంది. దశల వారీగా విస్తరించింది. ఒక్క బొగ్గుతోనే కాకుండా వివిధ విభాగాల్లో వచ్చే వాయువులను ఉపయోగించుకొని విద్యుత్ తయారుచేసే ప్లాంట్లను కూడా ఏర్పాటుచేసింది. మొత్తం 435 మెగావాట్ల సామర్థ్యం సమకూర్చుకుంది. దీనివల్ల విద్యుత్ వ్యయం తగ్గింది. సొంతానికి విద్యుత్ ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసేది. ఇదంతా గతం. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో వృథా వాయువులు రావడం లేదు. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గును అందించలేకపోవడం వల్ల అక్కడ కూడా ఉత్పత్తి పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్ తీసుకోవడం ప్రారంభించింది. వారికి నెలకు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల చెల్లింపునకు రెండేళ్లు వెసులుబాటు కల్పించింది. ఒత్తిడి తేవద్దని ఈపీడీసీఎల్‌కు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మళ్లీ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు క్యాప్టివ్ పవర్ ప్లాంటుతో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు ప్రైవేటుకు ఇస్తామని యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. టెక్నాలజీ మేనేజ్‌మెంట్, కోల్ కన్వేయర్ గ్యాలరీలు, కోల్ బంకర్ గ్యాలరీలు, బాయిలర్లు, టర్బో జనరేటర్లు, యాష్ వాటర్, యాష్ హ్యాండ్లింగ్ విభాగం అన్నీ కాంట్రాక్టు తీసుకునే సంస్థే నిర్వహించాలి. ఈ ఒప్పందం జరిగితే ఉక్కు యాజమాన్యానికి సుమారు 100 మంది ఉద్యోగుల భారం తగ్గిపోతుందని కార్మిక సంఘాల సమాచారం. యాజమాన్యం స్టీల్ ప్లాంటులో వివిధ విభాగాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నా బయట నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇక్కడి విభాగాలను నిర్వహించే సామర్థ్యం కలిగిన సంస్థలు చాలా తక్కువ. అందుకని ప్రకటనకు ఎంత స్పందన వస్తుందో చెప్పలేమని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.