జిల్లాకు మరో భారీ కంపెనీ
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:17 AM
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విశాఖ-చెన్నై కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో భారీ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్న కూటమి ప్రభుత్వం... అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కొత్త పరిశ్రమలు, కంపెనీలకు భూములు కేటాయిస్తున్నది. అదే విధంగా వివిధ రకాల రాయితీలను ప్రకటించి, ప్రోత్సాహాలను అందిస్తున్నది.
రాంబిల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ లిథియం
రూ.8,175 కోట్ల పెట్టుబడి
మూడు వేల మందికి ఉద్యోగాలు
300 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
బాలాజీ యాక్షన్ బిల్డ్‌వేస్‌కు పోత్సాహకాలు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
అనకాపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విశాఖ-చెన్నై కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో భారీ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్న కూటమి ప్రభుత్వం... అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కొత్త పరిశ్రమలు, కంపెనీలకు భూములు కేటాయిస్తున్నది. అదే విధంగా వివిధ రకాల రాయితీలను ప్రకటించి, ప్రోత్సాహాలను అందిస్తున్నది. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటకు భూ కేటాయింపులు జరిపారు. రాంబిల్లి మండలంలో రూ.8,175 కోట్ల భారీ పెట్టుబడులతో ‘మెస్సర్స్ వారే ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ (డబ్ల్యూఈఎస్‌ఎస్‌పీఎల్) గ్రీన్‌ఫీల్డ్ లిథియం అయాన్‌సెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 300 ఎకరాలను కేటాయించింది. సంవత్సరానికి 16 గిగావాట్ పవర్ సామర్థ్యంతో లిథియం అయాన్‌సెల్ గిగాఫ్యాక్టరీతో పాటు బ్యాటరీ ఎనర్జీ సోరేజీ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలకు అవసరమైన విద్యుత్ నిల్వ సుదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కంపెనీలో ప్రత్యక్షంగా మూడు వేల మందికి, అనుబంధ రంగాల్లో పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.
బాలాజీ యాక్షన్ బిల్డ్‌వేస్‌కు పోత్సాహకాలు
రాంబిల్లి మండలంలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వేస్ ప్రైవేటు లిమిటెడ్ (యాక్షన్ టెసా) ఏర్పాటు చేయనున్న ఎండీఆర్ బోర్డులు, ఇతర ఇంటరీయర్ సామగ్రి కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థ పెట్టుబడికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం అర్హత పొందిన పెట్టుబడులపై రూ.1,233.15 కోట్ల మేర ప్రోత్సాహకాలు, రూ.1,500 కోట్ల వరకు ఉత్పాదక కార్యకలాపాలకు సంబంధించి సబ్సిడీ సౌకర్యం కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.