జిల్లాలో మరో 100 శాఖా గ్రంథాలయాలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:09 AM
జిల్లాలో కొత్తగా 100 శాఖా గ్రంథాలయాలను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ తెలిపారు.
త్వరలో జిల్లా గ్రంథాలయ సంస్థకు శాశ్వత భవనం
ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, పథకాలపై ఏటా ఒక పుస్తకం
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొత్తగా 100 శాఖా గ్రంథాలయాలను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ తెలిపారు. నగరంలోని మహారాణిపేటలో జిల్లా కేంద్ర గ్రంథాలయం సొంత భవనానికి రెండుమూడు నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ భవన నిర్మాణానికి రూ.42 కోట్ల పాలనామోదం లభించిందన్నారు. సుమారు 64,180 చదరపు అడుగుల విస్తీర్ణంతో జీప్లస్ త్రీగా నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
ఉమ్మడి జిల్లాలో 67 శాఖా గ్రంథాలయాలు, 57 పుస్తక నిక్షిప్త కేంద్రాలున్నాయని వీటిలో ప్రస్తుతం 45 మంది పర్మినెంట్, 16 మంది తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.46.3 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌ను ప్రభుత్వానికి పంపామన్నారు. స్థానిక సంస్థల నుంచి రూ.244 కోట్ల సెస్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. గ్రంథాలయాల నిర్వహణకు సిబ్బంది కొరత వేధిస్తోందన్నారు. గ్రామాల్లో ఔత్సాహికులు, దాతలు ముందుకువస్తే పుస్తక నిక్షిప్త కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులపై ఏటా ఒక ఎడిషన్ ముద్రించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నామన్నారు. జిల్లాలో గ్రంథాలయాల పనితీరు,సేవలపై ప్రతి 45 రోజులకు ఒకసారి గ్రీవెన్స్ నిర్వహిస్తామని, జిల్లా గ్రంథాలయ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తామన్నారు. ఈనెల 28 నుంచి జూన్ 8 వరకు పిల్లలకు వేసవి శిక్షణ తరగులు నిర్వహిస్తామన్నారు.
గ్యాస్ సిలిండర్లకు తగ్గుతున్న నిరీక్షణ
పెరిగిన వాణిజ్య సిలిండర్ల సరఫరా
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం నిరీక్షించే వినియోగదారుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. శనివారం నాటికి జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు 1,49,508 మంది నిరీక్షిస్తున్నారు. వారం క్రితం వరకు 1.8 లక్షల మందితో నిరీక్షణ జాబితా ఉండేది. గతనెల రెండోవారం నుంచి సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా మార్చి మూడోవారం నుంచి ఈనెల రెండోవారం వరకు వినియోగదారులు నుంచి తీవ్ర ఒత్తిడి కొనసాగింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ పెరిగిపోయేది. ఏజెన్సీ నిర్వాహకులు, బాయ్స్‌తో వినియోగదారుల గొడవలు జరిగాయి. ఇదే సమయంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం, ఆ తరువాత పంపిణీ పరిమితం చేయడంతో చిరువ్యాపారులు డొమెస్టిక్ సిలిడర్లపై ఆధారపడ్డారు.
కాగా శనివారం నాటికి జిల్లాలో 23,500 సిలిండర్లు నిల్వ ఉండగా 18,388 సరఫరా చేశారు. బుక్‌చేసుకున్న తరువాత తొమ్మిది నుంచి 11 రోజుల వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. వచ్చే వారంలో నిరీక్షణ జాబితా మరింత తగ్గుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు అంచనావేశారు. అంతేకాకుండా వాణిజ్య సిలిండర్ల సరఫరా పెరిగిందని, దీంతో డొమెస్టిక్ సిలిండర్లపై ఒత్తిడి తగ్గుతోందన్నారు.
జిల్లా స్వర్ణగ్రామం, వార్డు అధికారిగా పూర్ణిమాదేవి
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారిగా ఆర్.పూర్ణిమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా డ్వామా పీడీగా ఉన్న పూర్ణిమాదేవిని పదిరోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లా స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అధికారిగా నియమించారు. తాజాగా ఆదివారం జారీచేసిన ఉత్తర్వుల్లో ఆమెను విశాఖ జిల్లాలో నియమించారు. ఇప్పటివరకు జిల్లా స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అధికారిగా విశాఖ డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి ఉషారాణి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈనెల 20న రద్దు చేసినట్టు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా సింహాచలం చందనోత్సవం విధుల్లో ఉండడతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అర్జీదారులు గమనించి, వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన సూచించారు.
టెన్త్ సిలబస్‌పై బ్రిడ్జి కోర్సు
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌పై సోమవారం నుంచి బ్రిడ్జి కోర్సులు నిర్వహించనున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి పదోతరగతి సిలబస్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖ రెండు నెలల క్రితమే ప్రణాళిక అమలుచేసింది. ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిది చదివే విద్యార్థులకు పదోతరగతి సిలబస్ బోధిస్తుంటారు. దీంతో టెన్త్‌కు వచ్చేసరికి వారికి సిలబస్‌పై అవగాహన రావడంతో పదిలో మంచి మార్కులలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇదే విధానం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అమలుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి, రెండు నెలలుగా పదోతరగతి సిలబస్ బోధిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరింత అవగాహన కోసం సోమవారం నుంచి మూడు రోజులపాటు కోర్సులు నిర్వహించి సిలబస్ వివరించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలను ప్రతి పాఠశాలకు ఐదుచొప్పున అందజేశారు. అన్ని సబ్జెక్టులపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు.