Share News

31న పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించండి

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:22 AM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెలాఖరున(31న) పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాలను ప్రకటించాలని బుధవారం జిల్లా కలెక్టర్లకు ఒక ఉత్తర్వులో ఆదేశించింది.

31న పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించండి
పాడేరు మండలం మారుమూల కించూరు పోలింగ్‌ కేంద్రం

కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం

జిల్లాలో పెరగనున్న 27 కేంద్రాలు?

పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెలాఖరున(31న) పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాలను ప్రకటించాలని బుధవారం జిల్లా కలెక్టర్లకు ఒక ఉత్తర్వులో ఆదేశించింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాలను ఈ నెల 21 నాటికి రూపొందించాలని, 23న ముసాయిదా జాబితా ప్రకటించాలని, 26లోగా వాటిపై అభ్యంతరాలను పరిష్కరించాలని సూచించింది. అలాగే 29 నాటికి జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ స్టేషన్ల జాబితాలను ఆమోదించి, 31న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.

జిల్లాలో మరో 27 పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదన

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 624 పోలింగ్‌ కేంద్రాలుండగా హేతుబద్ధీకరణలో భాగంగా మరో 27 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు అవసరమని అధికారులు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు చేశారు. జిల్లాలో మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ కేంద్రాలు సైతం పలువురు ఓటర్లకు దూరమయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి పలుమార్లు నిర్వహించిన సమావేశాల్లో పోలింగ్‌ కేంద్రాల సమస్యలను తెలిపారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల అవసరాలు గుర్తించిన అధికారులు కొత్తగా మరో 27 చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలోని పాడేరు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం 318 పోలింగ్‌ కేంద్రాలుండగా, మరో 14 అవసరమని, అరకులోయ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం 306 ఉండగా, మరో 13 ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వాటికి ఎన్నికల కమిషన్‌ అనుమతి లభిస్తే జిల్లాలో మొత్తం 651 పోలింగ్‌ కేంద్రాలుంటాయి.

Updated Date - Aug 13 , 2026 | 12:22 AM