పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:22 PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం పాడేరులోని అన్న క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా అందజేశారు.
సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా పాడేరు, అరకులోయ క్యాంటీన్లలో ఉచితంగా భోజనాలు
ఉదయం అల్పాహారం కూడా..
పాడేరురూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం పాడేరులోని అన్న క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా అందజేశారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అన్న క్యాంటీన్‌లో భోజనాలు వడ్డించడంతో పాటు అందరితో కలిసి భోజనం చేశారు. రోజూ సుమారు 300 మందికి ఆహారం అందిస్తుండగా, సోమవారం వెయ్యి మందికి పైగా భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, డప్పోడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ ఎస్‌వీ రమణమూర్తి, రొబ్బి రాము, డిప్పల వెంకటకుమారి, అల్లంగి సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అరకులోయలో...
అరకులోయ: స్థానిక అన్న క్యాంటీన్‌లో సోమవారం సుమారు వెయ్యి మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా అందజేశారు. సీఎం చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దొన్నుదొర కేకు కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. అనంతరం భోజనాలు వడ్డించి అందరితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు శివరామకృష్ణ, పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.