అన్న క్యాంటీన్లు కిటకిట
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:35 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని అన్ని అన్న క్యాంటీన్లలో సోమవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలను ఉచితంగా వడ్డించారు.
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఉచితంగా అల్పాహారం, భోజనం
తరలివచ్చిన అన్నార్తులు
వేలాది మందికి భోజనాలు
స్వయంగా వడ్డించిన స్పీకర్ అయ్యన్న, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని అన్ని అన్న క్యాంటీన్లలో సోమవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలను ఉచితంగా వడ్డించారు. రోజూ ఉండే ఆహారపదార్థాలతోపాటు అదనంగా స్వీటు వడ్డించారు. జిల్లాలోని ఏడు అన్న క్యాంటీన్‌లలో ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సుమారు ఐదు వేల మందికి వడ్డిస్తుంటారు. చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సోమవారం ఏడు వేలమందికిపైగా భోజనాలు పెట్టారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అన్న క్యాంటీన్‌లో మూడు పూటలు కలిపి 930 మంది, రైల్వే స్టేషన్ వద్ద వున్న క్యాంటీన్‌లో 870 మంది భోజనాలు చేశారు. నర్సీపట్నంలో 550 మంది, చోడవరంలో 1,300 మంది, ఎలమంచిలిలో 1,500 మంది, మాడుగులలో 1,350 మంది, పాయకరావుపేటలో 700 మంది భోజనాలు చేసినట్టు అన్న క్యాంటీన్ల జిల్లా ఇన్‌చార్జి తెలిపారు.
నర్సీపట్నం అన్న క్యాంటీన్‌లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు భోజనం వడ్డించారు. అంతకుముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో అల్పాహారం, భోజనాలు పెట్టడానికి ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.76 లక్షలను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విరాళంగా అందించడం గొప్ప విషయమని అన్నారు.
చోడవరం అన్న క్యాంటీన్‌లో ఉచిత భోజనం పెట్టారు. వైట్ రైస్, కూర, సాంబారు, రసం, రోటి పచ్చడి, పెరుగుతోపాటు అదనంగా చక్కెర పొంగలిని వడ్డించారు. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం సుమారు 350 మందికి భోజనలు పెడుతుండగా, సోమవారం వెయ్యి మందికిపైగా భోజనాలు సమకూర్చారు. ఎమ్మెల్యే రాజు తన సొంత నిధులతో మరో వెయ్యి మందికి భోజనాలు పెట్టించారు.
ఎలమంచిలి పట్టణంలోని అన్న క్యాంటీన్ సోమవారం కిటకిటలాడింది. సాధారణంగా రోజూ మధ్యాహ్నం సుమారు 250 మందికి ఇక్కడ భోజనాలు వడ్డిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి మందికిపైగా భోజనాలు పెట్టారు. అదనంగా స్వీట్ పొంగలి, కేసరి వడ్డించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్లే విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్యనారాయణ, తదితర నేతలు స్వయంగా పలువురికి భోజనాలు వడ్డించారు. పాయకరావుపేటలోని అన్న క్యాంటిన్‌లో సోమవారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందజేశారు. మధ్యాహ్నం భోజనంలో చక్కెర పొంగలి అదనంగా వడ్డించారు. సుమారు 400 మంది భోజనం చేశారు. మాడుగుల అన్న క్యాంటీన్‌లో సోమవారం మధ్యాహ్నం వెయ్యి మందికి ఉచితంగా భోజనాలు అందించారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇక్కడ దాదాపు 700 మందికి అదనంగా భోజనం పెట్టారు.