Share News

అన్న క్యాంటీన్లు కిట కిట

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:13 AM

జీవీఎంసీ పరిధిలోని అన్న క్యాంటీన్‌లన్నీ సోమవారం రద్దీగా కనిపించాయి.

అన్న క్యాంటీన్లు కిట కిట

సీఎం చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఉచితంగా ఆహారం పంపిణీ

సోమవారం 40 వేల మంది భోజనం చేసినట్టు అంచనా

సాధారణ రోజులతో పోల్చితే 15 వేల వరకు అధికం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలోని అన్న క్యాంటీన్‌లన్నీ సోమవారం రద్దీగా కనిపించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో మూడు పూటలూ ఉచితంగా ఆహారం పంపిణీ చేసేందుకయ్యే మొత్తాన్ని (రూ.76 లక్షలు) ఆయన సతీమణి భువనేశ్వరి విరాళంగా అందజేశారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు సాధారణ రోజులతో పోల్చితే సోమవారం భారీగా తాకిడి పెరింది.

జీవీఎంసీ పరిధిలో 25 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం పది వేల మంది వరకు అల్పాహారం, పది వేల మంది వరకు మధ్యాహ్న భోజనం, ఐదు వేల మంది వరకు రాత్రి భోజనం చేస్తుంటారు. సోమవారం ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించడంతో అన్న క్యాంటీన్లకు తాకిడి పెరిగింది. ఉదయం 12 వేల మంది అల్పాహారం తీసుకున్నారు. అలాగే 20 వేల మంది మధ్యాహ్న భోజనం, 12 వేల మంది రాత్రి భోజనం చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కేజీహెచ్‌, విమ్స్‌, రామాటాకీస్‌ సమీపంలోని అన్న క్యాంటీన్లలో అత్యధికంగా ఆహారం పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఉచితంగా అన్న క్యాంటీన్లలో ఆహారం అందజేయడంపై భోజనానికి వచ్చిన వారంతా సంతోషం వ్యక్తంచేశారు. అన్న క్యాంటీన్లలో రూ.ఐదుకే ఆహారం అందజేస్తున్నారు. అయితే ఆ ఐదు రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆహారం పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.

ఉచితంగా భోజనం పెట్టడం సంతోషం

సీర అప్పలనాయుడు, హనుమంతువాక

అన్న క్యాంటీన్ల వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా కూలి పనులు చేసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వేకువజామునే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్లే అవకాశం ఉండదు. అలాగని హోటళ్లలో వందలు రూపాయలు వెచ్చించి, భోజనం చేయలేము. ఐదు రూపాయలకు మంచి నాణ్యతగల భోజనం ప్రతిరోజూ అందించడం సాధారణ విషయం కాదు. చంద్రబాబు జన్మదినం రోజున ఉచితంగా భోజనం అందించడం సంతోషం.

Updated Date - Apr 21 , 2026 | 01:13 AM