పాడేరు, అరకులోయలో అన్న క్యాంటీన్లు
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:27 PM
జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
రూ.కోటి వ్యయంతో రెండు నియోజకవర్గ కేంద్రాల్లో భవన నిర్మాణాలు
మన్యంలో పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి
మరో నెల రోజుల్లో ప్రారంభించే ందుకు సన్నాహాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేవలం రూ.5లకే మన్యంలోని పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
పాడేరులో ఎన్‌టీఆర్ రైతు బజార్‌లో, అరకులోయ టౌన్‌కు సమీపంలో అన్న క్యాంటీన్ల భవనాలను నిర్మిస్తున్నారు. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.51 లక్షలు చొప్పున కేటాయించారు. మరో నెల రోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు. ప్రస్తుతం గోడలు, శ్లాబుతో పాటు ప్లాస్టింగ్ పనులు తుదిదశకు చేరడంతో విద్యుత్ వైరింగ్ పనులను చేపడుతున్నారు. తర్వాత ఎలివేషన్, లోపల ఫర్నిచర్ పనులు చేపట్టి మరో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు.
అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం
అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం వలన ప్రధానంగా పేదలకు, ఇతర ప్రాంతాల నుంచి పాడేరు, అరకులోయ ప్రాంతాలకు వచ్చే మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. కేవలం రూ.5లకే రుచికర, నాణ్యమైన భోజనం అందుతుంది.
మన్యంలో వైసీపీ అంచనాలు తారుమారు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో వాటిని నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైసీపీ అప్పట్లో ప్రచారం చేసింది. అలాగే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలుండడంతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని భావించారు. కానీ వారి అంచనాలు, ప్రచారాన్ని తారుమారు చేస్తూ పాడేరు, అరకులోయలో అన్న క్యాంటీన్లను మంజూరు చేయడం, జోరుగా నిర్మాణ పనులు చేపట్టడడం, మరో నెల రోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయడం విశేషం.