అన్న క్యాంటీన్లు రెడీ
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:03 PM
జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పేదలకు రూ.5లకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు సిద్ధమయ్యాయి. ఇవి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పాడేరు, అరకులోయలో నిర్మాణాలు పూర్తి
రూ.కోటి వ్యయంతో నిర్మాణాలు
పనులు పూర్తికావడంతో ప్రారంభించేందుకు సన్నాహాలు
గిరిజన ప్రాంతాల్లో పేదల ఆకలి తీర్చేందుకు కూటమి కృషి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటిన్‌లను ఏర్పాటుచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాడేరు, అరకులోయల్లో అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లా కేంద్రం పాడేరులో ఎన్‌టీఆర్ రైతుబజార్‌లోను, అరకులోయలో టౌన్‌కు సమీపంలో అన్న క్యాంటీన్లను నిర్మించారు. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.51 లక్షలు చొప్పున కేటాయించారు. ప్రస్తుతం అన్ని పనులు తుది దశకు చేరడంతో త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పేదలకు ఎంతో ప్రయోజనం
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడంతో పేదలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కేవలం రూ.5లకు రుచికర, నాణ్యమైన భోజనం అందిస్తుండడంతో పేదలకు విశేషంగా ఉపయోపడుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పేదలకు తక్కువ ఖర్చుతో చక్కని ఆహారం లభ్యమవుతుందని వారంటున్నారు.
వైసీపీ శ్రేణుల అంచనాలు తారుమారు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం మొదట్లో ప్రకటించిన జాబితాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో వీటిని నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైసీపీ శ్రేణులు అప్పట్లో ప్రచారం చేశాయి. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలుండడంతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని భావించారు. కాని వారి అంచనాలు, ప్రచారాన్ని తారుమారు చేస్తూ పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను మంజూరు చేయడం, జోరుగా నిర్మాణ పనులు చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.