వేసవిలో పశు సంరక్షణ అవసరం
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:23 PM
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు, మేకలు, గొర్రెలు పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో అనారోగ్య సమస్యలు
పశువుల్లో తగ్గనున్న వ్యాధి నిరోధకశక్తి
పాడి రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
పశువైద్య శాస్త్రవేత్తల సూచన
చింతపల్లి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు, మేకలు, గొర్రెలు పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి. సహజంగా 18-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పశువులకు సౌకర్యంగానే ఉంటోంది. ఆపై అధిక ఉష్ణోగ్రత నమోదైతే పశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వడదెబ్బ కారణంగా పశువులు మృతి చెందే అవకాశముంది. వేసవిలో పశువులకు కావాల్సినంత మేత దొరక్కపోవడంతో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతోంది. ఈ కారణంగా పశువులు పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
వేసవిలో వచ్చే వ్యాధులు
ప్రధానంగా పశువుల్లో పోషకాహార లోపం కారణంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గి గొంతువాపు, గాలికుంటూ, జబ్బవాపు వ్యాధులు సోకే అవకాశముంది. దీంతోపాటు కలుషితమైన నీరు తాగడం, పశువులను కడగడంతో అంతర, బాహ్యపరాన్న జీవుల సమస్యలు అధికమవుతాయి. ఈ వ్యాధులు రాకుండా పాడి రైతులు వేసవి ప్రారంభంలోనే ప్రతి పశువుకు వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. అంతర, బాహ్యపరాన్న జీవుల నివారణకు నట్టల మందులు వేయించాలి. సమతుల్యమైన పోషకాలు కలిగిన ఆహారం, పరిశుభ్రమైన నీరు తగు మోతాదులో పశువులకు అందించాలి.
జీర్ణక్రియ సమస్యలు
సాధారణంగా వేసవిలో జీర్ణక్రియ సమస్యలు పశువుల్లో అధికంగా కనిపిస్తాయి. పశువుకు కావాల్సినంత మేత లభించకపోవడం, వేడి కారణంగా తక్కువ ఆహారం తీసుకోవడం, పరిశుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల మలబద్ధకం, పారుడు రోగాలు వస్తాయి.
ప్రత్యుత్పత్తి సమస్య
అధిక ఉష్ణోగ్రత కారణంగా పశువులు ఎదకు రాకుండా పోతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గడంతో పశువులలో అండాలు సరిగ్గా ఉత్పత్తికావు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గడంతో అండాశయాల్లో స్తబ్ధత, అండోత్పత్తి వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి. పశువులు ఎండుగడ్డి ఎక్కువగా తినడం వలన విటమిన్‌ఏ, కాపర్, మెగ్నీషియం, ఖనిజ లవణాల లోపం ఏర్పడి పశువులలో తాత్కాలిక వందత్వం కలుగుతుంది.
పాల దిగుబడి తగ్గుతుంది
వేసవిలో పశువులు నీరు ఎక్కువగా తాగి మేత తక్కువగా తింటాయి. ఈ కారణంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమస్యతో వేసవిలో మన దేశంలో పాల కొరత సమస్య కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పశువులకు అవసరమైన ఆహారాన్ని అందించాలి.
పశువులకు వడదెబ్బ
పశువులను మేత కోసం పొలాలు, అడవుల్లోకి తీసుకువెళతారు. వేసవిలో ఇలా చేయడం వల్ల పశువులు అధిక వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతాయి. పశువులు ఎక్కువ సమయం ఎండలో ఉండడం, తాగునీరు పూర్తి స్థాయిలో లభించకపోవడం వల్ల వడదెబ్బకు గురవుతాయి. పశువు శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నాడి వేగం బాగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయే ప్రమాదముంది. పశువుల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వడదెబ్బ తగిలిందని గుర్తించాలి. వెంటనే చల్లని ప్రదేశానికిగాని, షెడ్‌లోకిగాని తీసుకు వెళ్లాలి. పశువును చల్లటి, శుభ్రమైన నీటితో కడగాలి. పశువు తాగినంత నీరు ఇవ్వాలి. ప్రథమ చికిత్స కూడా అందించాలి. ప్రధానంగా ఉదయం 6గంటల నుంచి 11గంటలు, సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలోనే పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్లాలి.
పశువుల వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
వేసవిలో అధిక వేడి నుంచి పశువులను కాపాడుకోవడానికి మంచి వసతి ఏర్పాటుచేసుకోవాలి. గాలి, వెలుతురు బాగా ప్రసరించే విధంగా నిర్మించుకోవాలి. సూర్యరశ్మి నేరుగా షెడ్‌లోకి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టూ చెట్లు ఉండే ప్రాంతంలో పాక నిర్మించాలి. సిమెంట్ రేకులు కలిగిన షెడ్‌పై వేసవిలో 8-10సెంటీమీటర్ల మందంగా గడ్డిని కప్పాల్సి ఉంటుంది. వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గోనె సంచులను కట్టి చల్లని నీటితో తడుపుతూ ఉండాలి.
పాడిరైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
డాక్టర్ జి. సాయి విజయ రాజ్ఞి, పశువైద్యశాస్త్రవేత్త, కేవీకే, హరిపురం.
పశువులు వేసవిలో తక్కువ మేత తీసుకుని ఎక్కువ నీరుని తాగుతాయి. అవి తాగేనీరు పుష్కలంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు అన్ని వేళలా పశువులకు అందుబాటులో ఉంచాలి. ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పగటిపూట పచ్చగడ్డి, దాణా మిశ్రమాన్ని ఇచ్చి రాత్రి ఎండుగడ్డిని మేపాలి. పగటి పూట ఎండుగడ్డి మేపితే పశువులు నీరు ఎక్కువగా తీసుకుని మేత తక్కువగా తింటాయి.