అంగన్‌వాడీల ఆందోళన
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:56 AM
విజయవాడలో తమ రాష్ట్ర నాయకుల అరెస్టును నిరసిస్తూ, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ ఉద్యోగుల అసోసియేషన్ (సీఐటీయూ అనుబంధం) మంగళవారం నగరంలో ఆందోళన నిర్వహించింది.
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
విజయవాడలో తమ రాష్ట్ర నాయకుల అరెస్టును నిరసిస్తూ, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ ఉద్యోగుల అసోసియేషన్ (సీఐటీయూ అనుబంధం) మంగళవారం నగరంలో ఆందోళన నిర్వహించింది. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడనాడాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అంగన్‌వాడీ సిబ్బందిని బలవంతంగా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అసోసియేషన్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ లెక్కల దేవి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, కోశాధికారి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం నగరానికి రానున్నారు. ఉదయం 10.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో అరకు వెళతారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి తిరిగి హెలీకాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో మర్రిపాలెంలోని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నివాసానికి వెళతారు. గత నెల 25న వివాహం చేసుకున్న వాసుపల్లి కుమారుడు, కోడలుని ఆశీర్వదిస్తారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని విమానంలో బెంగళూరు వెళతారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు అర్హుల గుర్తింపు
జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 17,600 మంది
పాఠశాలల్లో 9,634 మంది...
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇచ్చేందుకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను నియంత్రించేందుకు ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తొలి దశలో 14 ఏళ్ల వయసున్న బాలికలను ఇవ్వనున్నారు. విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 14 ఏళ్ల వయసున్న బాలికలు 9,634 మంది ఉన్నట్టు గుర్తించి ఆరోగ్య శాఖకు సమాచారం అందించారు. అలాగే, చదువుకు దూరంగా ఉన్న, మధ్యలో మానేసిన బాలికలను ఆరోగ్య శాఖకు చెందిన ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం ఇంటింటి సర్వే ద్వారా గుర్తించారు. వారు 7,366 మంది ఉన్నారు. మొత్తం హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 17,600 మంది అర్హులుగా అధికారులు నిర్ధారించారు.
వ్యాక్సిన్ కోసం చూపులు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు ఈ వ్యాక్సిన్ సరఫరా కావాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ వస్తే జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పెదవాల్తేరులోని ఇమ్యునైజేషన్ కార్యాలయంలో స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తారు.
బార్‌ల ఏర్పాటుకు స్పందన నిల్
25 బార్‌లకు నోటిఫికేషన్...ఒక్క దరఖాస్తు కూడా రాని వైనం
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలో బార్ అండ్ రెస్టారెంట్‌ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకురావడం లేదు. జీవీఎంసీ పరిధిలో 25 బార్‌లకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, సోమవారం గడువు ముగిసేనాటికి ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీవీఎంసీ పరిధిలో 121 బార్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుతోపాటు రూ.ఐదు లక్షలు నాన్ రిఫండబుల్ డీడీ తీయడంతోపాటు బార్ లైసెన్స్ దక్కినవారు ఏడాదికి రూ.95 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీచేయగా 79 బార్‌లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. దీంతో పాలసీకి ప్రభుత్వం మార్పులు చేసి, దుకాణాలకు సరఫరా చేసిన ధరకే బార్‌లకు మద్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత గత ఏడాది అక్టోబరులో మరోసారి 52 బార్‌ల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీచేయగా, కేవలం 27 బార్‌లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో 25 బార్‌లు మిగిలిపోయాయి. తాజాగా వాటిని కేటాయించేందుకు గత నెల 23న నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుకు మార్చి రెండో తేదీ వరకూ అవకాశం కల్పించారు. నాలుగున లాటరీ తీయాలని నిర్ణయించారు. అయితే 25 బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం అధికారులను సైతం అవాక్కయ్యేలా చేసింది.