Share News

శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:24 AM

దేశంలో తొలి భాషా ప్రయుక్త విద్యా సంస్థగా ‘ఏయూ’ అవతరించింది. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ‘విశ్వకళాపరిషత్‌’ అనే పేరు ఏయూకు మాత్రమే ఉంది.

శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు

దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలో తొలి భాషా ప్రయుక్త విద్యా సంస్థగా ‘ఏయూ’ అవతరించింది. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ‘విశ్వకళాపరిషత్‌’ అనే పేరు ఏయూకు మాత్రమే ఉంది. పేరుకు తగినట్టుగానే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్ర లేఖనం, రంగస్థలం, శిల్పం వంటి వాటికి యూనివర్సిటీలో స్థానాన్ని కల్పించారు. లక్షలాది మందిని విద్యావంతులను చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఘనమైన చరిత్ర ఉంది.

వందేళ్ల క్రితం...బెజవాడ కేంద్రంగా...

ఆంధ్ర ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటుకోసం 1913 నుంచి ఐదేళ్లపాటు పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్వహించారు. ఫలితంగా 1926 మద్రాస్‌ యూనివర్సిటీ చట్టం ద్వారా ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం’ ఏర్పడింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని 1926 ఏప్రిల్‌ 26న బెజవాడ కేంద్రంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్ర ప్రాంతంలో 20 బీఈడీ, 20 డిగ్రీ హనర్స్‌ కాలేజీలు ఏయూ పరిధిలోకి వచ్చాయి. 1923లో పెట్టిన ఆంధ్ర మెడికల్‌ కాలేజీని కూడా ఏయూ పరిధిలోకి తీసుకువచ్చారు. అలా, పరిపాలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి స్నాతకోత్సవాన్ని 1927లో విజయవాడలో నిర్వహించారు.

తొలి వీసీగా సీఆర్‌ రెడ్డి

ఆంధ్ర యూనివర్సిటీ తొలి వైస్‌ చాన్సలర్‌గా సీఆర్‌ రెడ్డి, మొదటి రిజిస్ర్టార్‌గా సీడీ శెట్టి నియమితులయ్యారు. వర్సిటీ ఏర్పాటైన రోజే వీసీగా సీఆర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఉపకులపతికి ప్రతి నెల వచ్చే రెండు వేల వేతనంలో సగం మొత్తాన్ని ఆయన వర్సిటీ అభివృద్ధికి విరాళంగా ఇవ్వడంతోపాటు అభివృద్ధికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత బెజవాడ నుంచి మరో ప్రాంతానికి తరలించాలన్న డిమాండ్‌ వచ్చింది. సిండికేట్‌ (ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తరహా) సభ్యుల్లో అత్యధికులు విశాఖకు తరలించాలని సూచించారు. దాంతో 1930 సెప్టెంబర్‌ 5న విశాఖలో ‘ఏయూ’ ఏర్పాటైంది. సర్క్యూట్‌ హౌస్‌ డౌన్‌లోని వాల్తేర్‌ అప్‌ల్యాండ్‌ ప్రాంతంలో భవనాన్ని అద్దెకు తీసుకుని వర్సిటీ అధికారులు కార్యాలయాలను ఏర్పాటుచేశారు.

వెయ్యి ఎకరాలతో ఏర్పాటు

కొన్నాళ్లకు రెవెన్యూ, దాతలు అందించిన భూమి కలిపి మొత్తం వేయి ఎకరాల సువిశాల ప్రాంగణంలో ‘ఏయూ’ ఏర్పాటైంది. పిఠాపురం, విజయనగరం, బొబ్బిలి, జైపూర్‌ రాజులు, విశాఖకు చెందిన కొందరు భారీగా విరాళాలను అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని గ్రాంటుగా ఇచ్చింది.

వర్సిటీ తొలినాళ్లలో నాలుగు కోర్సులు, 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ప్రస్తుతం 450 ఎకరాల్లో, 215 భవనాల్లో వర్సిటీ ఉంది. విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్తలకు బహుమతులు ఇచ్చేందుకు అప్పటి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి జాతీయ బహుమతి నిధిని ఏర్పాటుచేశారు. సీవీ రామన్‌, శాంతిస్వరూప్‌, ఆచార్య చంద్రశేఖర్‌ వంటి ప్రముఖులకు బహుమతులను ఇచ్చి గౌరవించారు. అదే సమయంలో తనకు సహకారం అందడం లేదని మనస్తాపం చెంది ఉపకులపతి పదవికి కట్టమంచి రాజీనామా చేశారు. ఆయన తరువాత ఉపకులపతి బాధ్యతలు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అప్పగించారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపకులపతిగా పదవీకాలం ముగిసిన తరువాత తిరిగి ఉపకులపతిగా కట్టమంచి నియమితులయ్యారు. రెండోసారి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్న కట్టమంచి రామలింగారెడ్డి ఏయూ ప్రభ దశదిశలా వ్యాపించేలా పలు సంస్కరణలు చేపట్టారు. రెండోసారి ఉపకులపతిగా 13 ఏళ్లపాటు ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సేవలందించారు.

మేధావుల పుట్టినిల్లు

ప్రపంచంలో గొప్ప మేధావులుగా పేరుపొందిన ఎంతోమంది ‘ఏయూ’లో పాఠాలు బోధించారు. హిరెన్‌ ముఖర్జీ, సూరి భగవంతం, టీఆర్‌ శేషాద్రి, హుమయూన్‌ కబీర్‌, వీఈఆర్‌వీ రావు, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి ఎందరో మహనీయుల బోధనతో వర్సిటీ పునీతమైంది. నోబెల్‌ గ్రహీత సీవీ రామన్‌ ఏయూ పూర్వ విద్యార్థి. కొన్నాళ్లు గౌరవ ఆచార్యులుగా పనిచేసి పరిశోధనల్లో భాగస్వామ్యమయ్యారు. సుప్రసిద్ధ సంఖ్యా శాస్త్ర నిపుణుడు పద్మవిభూషణ్‌ సీఆర్‌ రావు ఏయూ పూర్వ విద్యార్థే. వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డులు, ఇద్దరు పద్మవిభూషణ్‌ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, అమెరికాలో ఎఫ్‌డీఏ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రభ ఆత్రేయ, జీఎంఆర్‌ గ్రూపుల అధినేత గ్రంథి మల్లికార్జునరావు వంటి ఎంతో మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే. తొలుత 20 మందితో ప్రారంభమైన వర్సిటీలో ప్రస్తుతం 20 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. ప్రస్తుతం 58 విభాగాలు, 16 ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, 188 ఐసీటీ అనుసంధాన తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, జీఐఎస్‌ ల్యాబ్‌లు, 76 సమావేశ మందిరాలతో వర్సిటీ విరాజిల్లుతోంది.

మధ్యలో ఒకసారి గుంటూరుకు..

తొలుత విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఏయూను విశాఖకు తరలించారు. అయితే, అనూహ్య పరిణామాలతో ఒకసారి గుంటూరుకు వర్సిటీని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏయూ ప్రాంగణమంతా సైనిక స్థావరంగా మారిపోయింది. 1942 ఏప్రిల్‌ 6న విశాఖ హార్బర్‌పై జపాన్‌ బాంబులు వేసింది. ఆ దాడి తరువాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు వినియోగించుకోవాలని అప్పటి బ్రిటీష్‌ సైన్యం భావించింది. యూనివర్సిటీని మార్చాలని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తరువాత 1942 ఏప్రిల్‌ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేశారు. కెమిస్ర్టీ విభాగం మినహా మిగిలిన విభాగాలు గుంటూరుకు మారాయి. కెమిస్ర్టీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాల్నింటినీ సైన్యం ఆక్రమించుకోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం 1945 జూన్‌ వరకు... అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం బయట నుంచి పని చేసింది.

19 మంది వైస్‌ చాన్సలర్లు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇప్పటిదాకా 19 మంది వైస్‌ చాన్సలర్లుగా పని చేశారు. తొలి వైస్‌ చాన్సలర్‌ సర్‌ సీఆర్‌ రెడ్డి కాగా, ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌. వర్సిటీకి చాన్సలర్‌గా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యవహరిస్తున్నారు.

లోగో ప్రత్యేకత..

ప్రతి చిహ్నానికి అర్థం స్ఫురించేలా ఆంధ్ర యూనివర్సిటీ లోగోను డిజైన్‌ చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడి బొమ్మ విశ్వవిద్యాలయాన్ని, వర్సిటీలోని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతిని ప్రతిబింబించేలా రూపొందించారు. సూర్యకిరణాలపై ఆర్యుల దీవెన చిహ్నమైన స్వస్తిక్‌ ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయట వృత్తం, భారతదేశ శాస్ర్తీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్ర్తాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞాన కేంద్రం అనే అర్థంలో తయారుచేశారు. ఉపనిషత్తులోని ‘తేజస్వినావఽధీతమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. అంటే దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక అని అర్థం. లోగోలోని దిగువ భాగంలో ఉన్న రెండు సర్పాలు, తామర రేకులు జ్ఞానాన్ని కోరుకునే వారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అలాగే, పురాతన కాలం నుంచి ఆంధ్రుల్లో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్ర్తి రూపొందించారు.

ఏదేమైనా ఒక విశ్వవిద్యాలయం నూరేళ్లకు పైగా విద్యను అందిస్తూ, ఎంతోమంది జీవితాల్లో విజ్ఞానకాంతుల్ని వెలిగిస్తోందంటే...అంతకన్నా శుభప్రదం, ఆనందం ఇంకేం ఉంటుంది.

ఘనంగా శతాబ్ది ఉత్సవాలు...

‘‘వందేళ్లు పూర్తిచేసుకున్న విశ్వ విద్యాలయాల జాబితాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలవడం గర్వంగా ఉంది. ఇటువంటి గొప్ప క్షణాల్లో వర్సిటీకి ఉపకులపతిగా సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నా. గత ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 26 వరకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను ఈ వేడుకల్లో భాగస్వాములను చేస్తున్నాం. పూర్వ విద్యార్థుల సంఘం, వర్సిటీలోని ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థుల సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం.’’

- ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, ‘ఏయూ’ ఉపకులపతి

Updated Date - Apr 19 , 2026 | 01:24 AM