Share News

ఇక బే-టెక్‌ సిటీ

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:11 AM

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ పేరుతో నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగానే బే-టెక్‌ సిటీ పేరుతో విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని (కైలాసగిరి ప్రాంతం నుంచి భీమిలి వరకూ...25 కిలోమీటర్లు) అభివృద్ధి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక బే-టెక్‌ సిటీ

  • బే సిటీ పేరు మార్చిన సీఎం చంద్రబాబు

  • కైలాసగిరి నుంచి భీమిలి వరకూ అభివృద్ధి

  • కాపులుప్పాడలో 500 ఎకరాల్లో ఐటీ, డేటా సెంటర్‌ పార్క్‌

  • రెండేళ్లలో 2 లక్షల సీటింగ్‌ సామర్థ్యం

  • మధురవాడ ఐటీ పార్క్‌కు రూ.వేయి కోట్లు పెట్టుబడులు వచ్చేలా మౌలిక వసతులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ పేరుతో నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగానే బే-టెక్‌ సిటీ పేరుతో విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని (కైలాసగిరి ప్రాంతం నుంచి భీమిలి వరకూ...25 కిలోమీటర్లు) అభివృద్ధి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ ద్వారా విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకూ ‘వైజాగ్‌ బే సిటీ’ పేరుతో అభివృద్ధి ప్రణాళికలు తయారుచేశారు. ఇప్పుడు దానినే ‘విశాఖ బే-టెక్‌ సిటీ’గా మార్చారు. ఇందులో ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, ఎనర్జీ, ఫార్మా, పోర్టులు అండ్‌ లాజిస్టిక్స్‌ రంగాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. అందులో ఐటీ ప్రధానంగా కనిపిస్తోంది. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు.

- ప్రస్తుతం ఇక్కడ ఐటీ రంగంలో ఉన్న యాంకర్‌ ప్లేయర్లు అంటే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ వంటి మేజర్‌ సంస్థల ద్వారా వచ్చే రెండేళ్లలో రెండు లక్షల మందితో ఆపరేషన్లు నిర్వహించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

- కొత్తగా మరో 15 నుంచి 20 ఐటీ కంపెనీలను విశాఖపట్నం రప్పించి ఒక్కొక్క సంస్థ ద్వారా 15 వేల నుంచి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు.

- విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న పెద్ద సంస్థలను గుర్తించి వాటిలో ఐదు నుంచి ఎనిమిది కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చి మరింత విస్తరింపజేయాలని నిర్ణయించారు.

- 2028-29 నాటికి కాపులుప్పాడలో 500 ఎకరాల్లో ఐటీ, డేటా సెంటర్‌ పార్కు నిర్మాణం పూర్తిచేయాలి. దానిని జీసీసీల హబ్‌గా అభివృద్ధి చేయాలి.

- కాపులుప్పాడలో శ్రీటెక్‌ డేటా కంపెనీకి 0.4 ఎకరాల స్థలం కేటాయింపు.

- ఆనందపురంలో 300 ఎకరాల్లో ఐటీ, డేటా సెంటర్‌ హబ్‌ అభివృద్ధి చేయాలి. ఇందులో గూగుల్‌ తరపున 80 నుంచి 100 ఎకరాల్లో ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన మొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా హబ్‌ పూర్తి కావాలి.

- మధురవాడ/రుషికొండ ఐటీ పార్కుల్లో వేయి కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి.


-

జనవరిలో సైన్స్‌ మ్యూజియం ప్రారంభం

త్వరగా పనులు పూర్తిచేయాలని ఉన్నతాధికారుల ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కైలాసగిరిపై మూడేళ్లుగా సాగుతున్న సైన్స్‌ మ్యూజియం పనులను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిచేసి జనవరిలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ సిటీ ఈ మ్యూజియం ఏర్పాటుకు 2023లో ప్రతిపాదన చేసింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆర్థిక సాయం చేయడానికి ముందుకురావడంతో 2024 జనవరి 2న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6 కోట్లు. కైలాసగిరిపై మొత్తం పది వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణ పనులు మొదలెట్టారు. ఇందులో 3డి ఆర్ట్‌ గ్యాలరీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, సిలికా విగ్రహాలు పెడతారు. పిల్లలకు సైన్స్‌, సాంకేతిక అంశాలపై ఆసక్తి కలిగే పలు అంశాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టు బాధ్యత అంతా ఏపీ సైన్స్‌ సిటీయే చూసుకుంటోంది. నిర్మాణ పనులను వీఎస్‌ఎన్‌ కనస్ట్రక్షన్స్‌కు అప్పగించారు. ఏడాది కాలంలో పూర్తికావలసిన ప్రాజెక్టు మూడేళ్లు కావస్తున్నా ఇంకా అసంపూర్తిగానే ఉంది. దాంతో ఏపీ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సెక్రటరీ హనుమంతు పురుషోత్తం, ఏపీ సైన్స్‌ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు కలిసి ఈ నెల 12న కైలాసగిరిపై నిర్మాణాన్ని పరిశీలించారు. పనులన్నింటినీ డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. అనుకున్నట్టుగా మ్యూజియం పూర్తిచేసి అప్పగిస్తే జనవరిలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.4.69 కోట్లు ఇవ్వగా, ఏపీ సైన్స్‌ సిటీ ్థరూ.93.8 లక్షలు సమకూరుస్తోంది. ఏడాదిలో పూర్తికావలసిన ప్రాజెక్టు రెండేళ్లు జాప్యం కావడం వల్ల వ్యయం ఎంత పెరిగిందనేది ఇంకా వెల్లడి కాలేదు. నిర్మాణం పూర్తయిన తరువాత నిర్వహణ బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు అప్పగించే అవకాశం ఉంది.


పంచారామాలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ విశాఖ డివిజనల్‌ మేనేజర్‌ జగదీశ్‌ శుక్రవారం తెలిపారు. ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోని అమరావతి అమరేశ్వరస్వామి ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం, సామర్లకోటలోని కుమారస్వామి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. మొదటిరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం నుంచి యాత్ర ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటలకు అమరావతి చేరుకుంటారు. తిరిగి రెండో రోజు రాత్రి 10.30 గంటలకు విశాఖ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. మొత్తం 840 కిలోమీటర్ల ప్రయాణం. నాన్‌ ఏసీ బస్సులో ప్రతి ఆదివారం అంటే నవంబరు 22, 29, డిసెంబరు 6వ తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. టికెట్‌ పెద్దలకు రూ.2,380, పిల్లలకు రూ.1,910గా నిర్ణయించారు. ఇతర వివరాలకు 9948813584 నంబరులో సంప్రతించాలని సూచించారు.

Updated Date - Nov 21 , 2026 | 01:11 AM