రైతుబజార్లలో ఇష్టారాజ్యం
ABN , Publish Date - May 26 , 2026 | 12:45 AM
నగరంలోని రైతుబజార్లలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారుల పక్షపాత ధోరణి
తమను ప్రసన్నం చేసుకుంటే ఒకలా, లేదంటే మరోలా చూస్తున్న వైనం
అనుమతి లేకుండా స్టాల్ నిర్మాణం వ్యవహారంలో పెదవాల్తేరు రైతుబజార్ ఈఓ సస్పెన్షన్
నరసింహనగర్ రైతుబజార్ అటెండర్
అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
...పైగా అతనికి నచ్చిన చోటకు బదిలీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని రైతుబజార్లలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులకే పూర్తిగా వదిలేయడం వల్ల వారు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారి పట్ల ఒకలా, పట్టించుకోనివారి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుతోంది.
రైతుబజార్లు ఎస్టేట్ అధికారి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. వారికి సహాయకులుగా అటెండర్లు ఉంటారు. రాత్రిపూట దొంగతనాలు జరగకుండా వాచ్‌మెన్లు ఉంటారు. ఎవరు తప్పు చేసినా తగిన చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఒక్కొక్కరిపై ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. పెదవాల్తేరు రైతుబజార్‌లో అనుమతి లేకుండా ఒక స్టాల్ నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి స్పందించి అక్కడి ఎస్టేట్ అధికారిణిని ఇటీవల సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఆ నిర్మాణానికి ఉన్నతాధికారులే అడ్డగోలుగా పచ్చజెండా ఊపి, పత్రికలో వార్త రాగానే విచారణ పేరుతో ఈఓపై చర్యలు చేపట్టారు. ఇది జరిగిన తరువాత నరసింహనగర్ రైతుబజార్‌లో అటెండర్ అందరి వద్ద అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన అవన్నీ నిర్ధారించుకొని, సదరు అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఈ ఏడాది జనవరిలో లేఖ రాశారు. దీనిపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పెదవాల్తేరులో ఈఓను సస్పెండ్ చేసినట్టు ఇక్కడ అటెండర్‌పై చర్యలు తీసుకోలేదు. పైగా ఆ అటెండర్ కోరుకున్న పెందుర్తికి బదిలీ చేశారు. అక్కడి అటెండర్‌ను వేరే బజార్‌కు బదిలీ చేయకుండా నాలుగు నెలల పాటు ఇద్దరినీ కొనసాగించారు. అక్కడ తనకు సకల మర్యాదలు చేయడం లేదని, తోటి సిబ్బందిపై ఫిర్యాదు చేయడంతో గోపాలపట్నంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు వెళ్లి నానా రభస చేశారు.
వారికి నచ్చినప్పుడే బదిలీలు
ఇటీవల అటెండర్లను బదిలీ చేస్తూ జేసీకి ఫైల్ పెట్టారు. తర్జనభర్జనల తరువాత ముగ్గురిని బదిలీ చేశారు. పెందుర్తిలో అదనంగా వేసిన అటెండర్‌ను తీసుకువచ్చి ఆయన కోరుకున్న గోపాలపట్నం బజార్‌లో నియమించారు. క్రమశిక్షణ చర్యలు చేపట్టినప్పుడు నగరానికి దూరంగా వేయాలి. కానీ ఆ ఉద్యోగి కోరుకున్న బజార్లలో వేయడమే ఇక్కడి పక్షపాత ధోరణికి అద్దం పడుతోంది.
కుటుంబ సభ్యులకు దుకాణాలు
ఆరోపణలు ఎదుర్కొంటున్న అటెండర్‌పై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు ఉందని సమాచారం. అప్పట్లో మహిళా రైతును వేధించగా, కేసు పెట్టినట్టు తెలిసింది. ఆ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరికి వేర్వేరు బజారుల్లో రెండు స్టాళ్లు ఉన్నాయి. ఒకరు కూరగాయలు విక్రయిస్తుంటే, మరొకరు నిమ్మకాయలు అమ్ముతున్నారు. సదరు అటెండర్ కూడా గతంలో రైతుబజార్ బయట నిమ్మకాయలు అమ్ముకునేవాడని, తెలిసిన వారిని పట్టుకొని అటెండర్ ఉద్యోగం సంపాదించినట్టు సమాచారం. ఎకరాల కొద్దీ వ్యవసాయ భూమి కలిగిన ఈ అటెండరే రైతులకు బదులుగా అనర్హులకు కార్డులు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై విచారణ బాధ్యతను వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులకే వదిలేస్తే న్యాయం జరగని పరిస్థితి ఉంది. రైతుబజార్ల ప్రక్షాళనపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది.