Share News

గ్రేటర్‌లో ఇష్టారాజ్యం

ABN , Publish Date - May 16 , 2026 | 12:36 AM

జీవీఎంసీ అధికారులు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

గ్రేటర్‌లో ఇష్టారాజ్యం

ఒక ప్రాంతానికి మంజూరైన పనులు...

మరొక ప్రాంతంలో చేపడుతున్న అధికారులు

తూర్పు జోన్‌లో నాలుగుచోట్ల ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు రూ.41.2 లక్షలు మంజూరు

అక్కడ కాకుండా వేరొక ప్రాంతంలో...అదీ ఒక్కచోటే అన్ని పరికరాల ఏర్పాటుకు సన్నాహాలు

నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేసినా పట్టని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ అధికారులు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌ జోన్‌లో నాలుగు వేర్వేరు ప్రాంతాలకు మంజూరైన ఓపెన్‌ జిమ్‌లను...అక్కడ కాకుండా మరొక ప్రాంతంలో, అదీ ఒకేచోట ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యారు. ఒకచోట మంజూరైన పనిని వేరొకచోటకు మార్చాలంటే తప్పనిసరిగా కమిషనర్‌ ఆమోదం తీసుకోవాలి. కానీ అధికారులు అలాంటి ప్రక్రియను పూర్తిచేయకుండానే జిమ్‌ ఏర్పాటుపనులను ప్రారంభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తూర్పు జోన్‌ (పాతజోన్‌-2) పరిధిలోని ఆరిలోవ సంజీవయ్య నగర్‌, బాలాజీనగర్‌, శ్రీకాంత్‌నగర్‌, రామకృష్ణాపురంలో ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటుకోసం నగర పాలక సంస్థ రూ.41.2 లక్షలు గత ఏడాది నవంబరులో మంజూరుచేసింది. ఇంజనీరింగ్‌ అధికారులు ఇటీవల వరకు ఆ పనులను ఎందుచేతనోగానీ ప్రారంభించలేదు. ఇంతలో ఏమైందోగానీ ఈనెల 13న రాత్రి సమయంలో చినగదిలిలోని యానిమల్‌ హజ్బండరీ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ బోర్డు సొసైటీ లేఅవుట్‌లో బోర్‌ కోసం రిజర్వు చేసిన స్థలంలో జిమ్‌ పరికరాల ఏర్పాటుపనులను ప్రారంభించారు. లేఅవుట్‌లో బోరు కోసం రిజర్వు చేసిన స్థలాన్ని అందుకోసమే వినియోగించాలి తప్పితే, ఇతర అవసరాలకు వాడకూడదని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు అక్కడ జిమ్‌ పరికరాలను ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై జిమ్‌ పరికరాలు ఏర్పాటుచేస్తున్న రిజర్వు స్థలానికి ఆనుకుని ఉన్న ప్లాట్‌ యజమాని ఒకరు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు లేఅవుట్‌ సంఘ పెద్దనంటూ ఒకరు వచ్చి రిజర్వు స్థలం చదును చేస్తున్నావని ఆరోపిస్తూ రూ.రెండు లక్షలు డిమాండ్‌ చేశారని, తాను తన స్థలంలోనే నిర్మాణం చేస్తున్నానని స్పష్టంచేశానని అధికారులకు వివరించారు. లేఅవుట్‌ సంఘ నేతగా చెప్పుకుని డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తే జీవీఎంసీలోని అధికారులతో ఉన్న సంబంధాలను ఆసరాగా తీసుకుని నాలుగుచోట్ల మంజూరైన జిమ్‌ పరికరాలను లేఅవుట్‌లోని రిజర్వు స్థలంలో ఏర్పాటుచేసేలా చక్రం తిప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 16 , 2026 | 12:36 AM