Share News

‘ఆనందం’తో గిరి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:03 PM

గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఆనందం కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

‘ఆనందం’తో గిరి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
పాడేరు గురుకుల పాఠశాల ఆనందం కార్యక్రమం ప్రారంభంలో కలెక్టర్‌ టి.నిషాంతి, తదితరులు

జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమాల్లో ఆనందం కార్యక్రమం అమలు

పాడేరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఆనందం కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. శనివారం స్థానిక గురుకుల పాఠశాలలో ‘ఏఎస్‌ఆర్‌ ఆనందం’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నిషాంతి మాట్లాడుతూ.. విద్యాలయాల్లో కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు అవసరమైన జీవన నైపుణ్యాలు, వారిలో దాగిన సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీయడం, ఆత్మ విశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఆలోచనతోనే ‘ఆనందం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసం, సృజనాత్మకత, స్థానిక గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, జీవితంలో ఎదిగేందుకు అవసరమైన మెలకులు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విధిగా అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో అనందం కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారని కలెక్టర్‌ నిషాంతి అన్నారు. ఈసందర్భంగా గురుకులం బాలికలతో కలెక్టర్‌ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళ, గురుకులం సెల్‌ ఓఎస్‌డీ పీఎస్‌ఎన్‌.మూర్తి, ఏటీడబ్ల్యూవో అఖిల, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:03 PM