అనకాపల్లి- సోలాపూర్ రైలు సెప్టెంబరు వరకు పొడిగింపు
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:15 AM
అనకాపల్లి- సోలాపూర్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది.
అనకాపల్లి టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి- సోలాపూర్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది. జిల్లా నుంచి తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్థానిక ఎంపీ, రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ అయిన సీఎం రమేశ్ ఆదేశాల మేరకు గత ఏడాది డిసెంబరు 19వ తేదీన ఈ రైలును ప్రవేశపెట్టారు. 01477 నంబరుతో ప్రతి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 11.05 గంటలకు తిరుపతి చేరుతుంది. ఐదు నిమిషాల అనంతరం తిరిగి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అనకాపల్లి చేరుతుంది. తిరిగి 01478 నంబరులో ప్రతి శనివారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి ఆదివారం ఉదయం ఏడు గంటలకు తిరుపతి చేరుతుంది. ఐదు నిమిషాల తరువాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 11.50 గంటలకు సోలాపూర్ చేరుతుంది. అనకాపల్లి- సోలాపూర్ ప్రత్యేక వారాంతపు రైలును మరో మూడు నెలలపాటు పొడిగించడంపట్ల ప్రయాణికులు, తిరుపతి వెళ్లే భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.