Share News

నంబర్‌వన్‌గా అనకాపల్లి

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:04 AM

భవిష్యత్తులో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా అనకాపల్లి జిల్లాను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పాటు భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

నంబర్‌వన్‌గా అనకాపల్లి
అలమండ కోడూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

- భారీ పరిశ్రమలు, డేటా సెంటర్ల రాకతో జిల్లాకు ఉజ్వల భవిత

- విశాఖను మించి పెట్టుబడులు

- పారిశ్రామిక ప్రగతితో భారీగా ఉపాధి అవకాశాలు

- వచ్చే నెల మొదటి వారంలో జిల్లాకు గోదావరి జలాలు

- అలమండ కోడూరు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబునాయుడు

అనకాపల్లి/కె.కోటపాడు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా అనకాపల్లి జిల్లాను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పాటు భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. కె.కోటపాడు మండలం అలమండ కోడూరులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌సిటీ, డేటా సెంటర్లు వంటి భారీ ప్రాజెక్టులు జిల్లాకు వస్తున్నాయని, అన్ని కంపెనీలకు కేంద్రంగా, నాలెడ్జ్‌ ఎకానమీగా జిల్లా రూపుదిద్దుకోనుందని చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాకు గోదావరి నీటిని తీసుకువస్తామని సీఎం ప్రకటించారు. పోలవరం నుంచి వచ్చే నీటితో జిల్లాలోని ప్రతి చెరువును నింపేలా చర్యలు చేపడతామన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వ్యవసాయం, తాగునీటి అవసరాలకు నీటి లభ్యతను పెంచుతామని చెప్పారు.

పరిశ్రమల కేంద్రంగా అనకాపల్లి

గతంలో అనకాపల్లికి పెట్టుబడులు రాక జిల్లా వెనుకబడుతోందని పలువురు ఆవేదన చెందారని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం విశాఖను మించి జిల్లాకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. మిట్టల్‌ స్టీల్‌సిటీ నిర్మాణం, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలు జిల్లాకు రావడంతో పారిశ్రామికంగా కొత్తరూపు సంతరించుకోనుందన్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా ఏఎస్‌ఆర్‌ విమానాశ్రయం ఇటీవలే భోగాపురంలో ప్రారంభమైందని, ఇది ఉత్తరాంధ్ర ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడుగుతుందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక ప్రగతితో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని తెలిపారు.

మాడుగుల అభివృద్ధిపై ఫోకస్‌

టీడీపీకి దశాబ్దాల కాలంగా కంచుకోటగా నిలిచిన వెనుకబడిన ప్రాంతం మాడుగుల నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 10 వేల ఎకరాల భూసేకరణ జరిపి ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. తారకరామ రిజర్వాయర్‌ పునరుద్ధరణ పనులను రూ.29 కోట్లతో చేస్తామన్నారు. రైవాడ జలాశయ ఆధునికీకరణకు అవసరమైన డీపీఆర్‌ రూపొందించి సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటు పాలిటెక్నిక్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

స్వచ్ఛతకు ప్రాధాన్యం

అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు మాత్రమే కాదని, స్వచ్ఛమైన ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛత, సమాజ హితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, రోడ్లు, పరిసరాలు అన్నీ మనవేనన్న భావనంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలమండ కోడూరులో ధర్మ కోనేరును పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలను సీఎం అభినందించారు. మన ఊరు-మన బాధ్యత అనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.

గ్రీన్‌ అంబాసిడర్లకు సన్మానం

స్వచ్ఛ అలమండ కోడూరుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన గ్రీన్‌ అంబాసిడర్లు గూడూరు దేముడు, పిన్నింటి సింహాచలం, కండిపల్లి రాము, పిన్నింటి ఏసురత్నం, అప్పారావులను ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సత్కరించారు. పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సేవల టూల్‌కిట్‌ పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షత వహించారు. మునిసిపల్‌ శాఖామంత్రి నారాయణ, గనులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖల మంత్రి కొల్లు రవింద్ర, ఎంపీలు సీఎం రమేశ్‌, సీహెచ్‌ విజయ్‌, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, తదితరులు ఉన్నారు.

కోడూరు విద్యార్థుల ప్రతిభకు సీఎం ప్రశంసలు

కోడూరు పీఎంశ్రీ జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న స్వాతిప్రియతో స్వచ్ఛాంధ్ర పతిజ్ఞ చేయించారు. మూడో తరగతి చదువుతున్న మాధురి ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన తీరుపై సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర, రాష్ట్రంలో విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనపథకం, ముస్తాబు వంటి పథకాలపై ప్రసంగించిన ఆరవ తరగతి విద్యార్థిని స్వాతిప్రియను, అనకాపల్లికి చెందిన భార్గవి, పదవ తరగతి విద్యార్థి రాయవరం వరప్రసాద్‌ను సభాముఖంగా సీఎం అభినందించారు.

ప్రభుత్వ శాఖలపై సమీక్ష

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష జరిపారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా విద్య, వైద్య, వ్యవసాయ శాఖలతో పాటు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సీఎం సమీక్షించారు. గ్రామ పంచాయతీ, వ్యవసాయం, మునిసిపాలిటీలు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఈపీడీసీఎల్‌, ఆస్పత్రుల నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్‌ శాఖలకు సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో బాగా పనిచేసిన ప్రభుత్వ శాఖల అధికారులను సీఎం అభినందించారు. జిల్లా స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల పరిష్కారంలో వెనుకబాటుపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ను సీఎం ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైతే అన్ని శాఖలతో సమీక్షలు జరపాలని సూచించారు.

Updated Date - Aug 23 , 2026 | 01:04 AM