అనకాపల్లి- సోలాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:40 AM
అనకాపల్లి- సోలాపూర్ మధ్య ఇప్పటి వరకు నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలు, శనివారం నుంచి వారాంతపు రెగ్యులర్ సర్వీసుగా నడవనున్నది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేక రైలు నుంచి రెగ్యులర్ సర్వీసుగా మార్పు
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి- సోలాపూర్ మధ్య ఇప్పటి వరకు నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలు, శనివారం నుంచి వారాంతపు రెగ్యులర్ సర్వీసుగా నడవనున్నది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అక్టోబరు చివరి వారంలో ప్రత్యేక సర్వీసుగా ప్రారంభించిన ఈ రైలు.. ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు అనకాపల్లి చేరుతున్నది. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి ఆదివారం అర్ధరాత్రి 11.50 గంటలకు సోలాపూర్ చేరుకుంటున్నది. విజయవాడ, తిరుపతి, మదనపల్లె, అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి మీదుగా నడుస్తున్న ఈ రైలుకు ఆదరణ బాగుండడంతో రైల్వే అధికారులు దీనిని రెగ్యులర్ వారాంతపు రైలుగా నడపాలని నిర్ణయించారు. శుక్రవారం (21వ తేదీ) సోలాపూర్‌లో 11313 నంబరుతో సర్వీసు ప్రారంభం అవుతుంది. శనివారం సాయంత్రం అనకాపల్లి నుంచి 11314 నంబరుతో బయలుదేరి వెళుతుంది. ఇప్పటి వరకు ఈ సర్వీసులు 01477/ 01478 నంబర్లతో నడిచాయి. అనకాపల్లి నుంచి బయలుదేరే రైలు ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్డు, కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణా, యాదగిర్, వాడీ, కల్‌బుర్గి, గంగాపూర్‌రోడ్డు, దుదాని, అఖల్‌కోట్‌రోడ్డు స్టేషన్లలో ఆగుతుంది.