అనకాపల్లి- సికింద్రాబాద్ రైలు ప్రారంభం
ABN , Publish Date - May 19 , 2026 | 12:03 AM
ప్రయాణికుల సౌకర్యార్థం అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు సోమవారం సాయంత్రం వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు కమిటీ చైర్‌పర్సన్ సీఎం రమేశ్ జెండా ఊపి ప్రారంభించారు.
జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ సీఎం రమేశ్
హాజరైన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు
అనకాపల్లి టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు సోమవారం సాయంత్రం వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు కమిటీ చైర్‌పర్సన్ సీఎం రమేశ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పచ్చజెండా ఊపారు. 17044 ఎక్స్‌ప్రెస్ నంబరు గల ఈ రైలు సోమవారం సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరింది. ఈ రైలు ఫస్ట్ ఏసీ ఒకటి, సెకండ్ ఏసీ నాలుగు, థర్డ్ ఏసీ 12 బోగీలతో ప్రారంభమైంది. ఇది ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, కృష్ణా చానల్ జంక్షన్, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి, చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు మంగళవారం ఉదయం 8.40 గంటలకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ విశాఖ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావుతో పాటు కూటమి నాయకులు, స్టేషన్ మేనేజర్ సచ్చి నివాస్ పాల్గొన్నారు.