Share News

ప్రతిష్ఠాత్మకంగా అనకాపల్లి ఉత్సవ్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:18 AM

జిల్లాలో రెండు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఉత్సవ్‌ ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి శాసనసభ్యులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రతిష్ఠాత్మకంగా అనకాపల్లి ఉత్సవ్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌. పక్కన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌

రెండు రోజులపాటు భారీఎత్తున కార్యక్రమాలు

కొండకర్ల ఆవలో బోటింగ్‌

తిక్కవానిపాలెం వద్ద సాహస క్రీడలు

అనకాపల్లి మార్కెట్‌ యార్డులో ఫ్లవర్‌ షో, మెయిన్‌ రోడ్డులో కార్నివాల్‌

ఎన్టీఆర్‌ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఉత్సవ్‌ ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి శాసనసభ్యులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కొండకర్ల ఆవ, తిక్కవానిపాలెం, అనకాపల్లిలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొండకర్ల ఆవ వద్ద బోటింగ్‌, జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిక్కవానిపాలెం వద్ద సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయన్నారు. అనకాపల్లిలోని బెల్లం మార్కెట్‌ యార్డు వద్ద ఫ్లవర్‌ షో, పట్టణంలో కార్నివాల్‌, ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన వుంటాయన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో 29వ తేదీన గాయని సునీత, 30వ తేదీన రామ్‌ మిరియాల సంగీత విభావరి వుంటాయని చెప్పారు.

అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఈ ఉత్సవాలతో జిల్లాకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సూచించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఏటికొప్పాక బొమ్మలు, వెదురు బుట్టల తయారీపై స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ, తిక్కవానిపాలెం వద్ద సాగర తీరంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నందున పోలీసు బందోబస్తుతోపాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్‌ ఆయీషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:18 AM