అనకాపల్లికి పండుగ శోభ
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:46 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తికావడంతో ప్రారంభానికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో తేదీన ఉదయం 10.58 గంటలకు శుభ ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు.
నూకాంబిక అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తి
ఎనిమిదో తేదీ ఉదయం 10.58 గంటలకు ప్రారంభోత్సవం
అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు
రాజగోపురంపై కలశాల ప్రతిష్ఠ
మహాసంప్రోక్షణ, యజ్ఞయాగాదులు
భారీఎత్తున ఏర్పాట్లు
అనకాపల్లి టౌన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తికావడంతో ప్రారంభానికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో తేదీన ఉదయం 10.58 గంటలకు శుభ ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. నూకాంబిక అమ్మవారి ప్రధాన ఆలయం పునఃప్రారంభం, రాజగోపురంపై కలశాల ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ, యజ్ఞయాగాదుల వంటి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్ తెలిపారు. ఆలయంతోపాటు రాజగోపురాన్ని వివిధ రకాల రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 100 అడుగుల ఎత్తున నిర్మించిన రాజగోపురంపై పలు దేవతామూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దారు. మహాసంప్రోక్షణ, యజ్ఞం వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం తాటాకు పందిళ్లతో యాగశాలను నిర్మించారు. ఆలయంతోపాటు ప్రాంగణం మొత్తం విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. కాగా ఆలయ పునర్నిర్మాణం కోసం సుమారు మూడేళ్ల నుంచి అమ్మవారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించడంలేదు. ఇప్పుడు ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ఆదివారం ఉదయం అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. పునర్నిర్మితమైన నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.