Share News

పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:13 AM

పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి

పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి
జ్యోతిప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో స్పీకర్‌ అయ్యన్న, ఎంపీ సీఎం రమేశ్‌, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుందరపు, ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ’ సీఎండీ సుమంత్‌ సిన్హా ఉన్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం

ఉపాఽది కోసం వలస వెళ్లాల్సిన పనిలేదు

వచ్చే ఏడాది జిల్లాకు గోదావరి జలాలు

వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీరు

ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగే

28వ తేదీన గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాంబిల్లి ఏపీఐఐసీ సెజ్‌లో

రెన్యూ ఎనర్జీ సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌కు భూమి పూజ

రాంబిల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. రాంబిల్లి మండలం జడ్‌.చింతువ పంచాయతీ గజిరెడ్డిపాలెం వద్ద (ఏపీఐఐసీ ఫేజ్‌-2 సెజ్‌) సుమారు ఐదున్నర వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ’ ఏర్పాటుచేయనున్న సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌, హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు పనులకు ఆయన గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తీసుకువస్తామన్నారు. దీనివల్ల వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం తెలంగాణ) తరహాలో ఇక్కడ అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసి, దేశం దృష్టిని ఆకర్షించేలా చేస్తామని ప్రకటించారు. జిల్లాలో రూ.1.35 వేల కోట్ల పెట్టుబడులతో నక్కపల్లి మండలంలో ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ ఇండియా స్టీల్‌ ఇండియా ఏర్పాటుచేసే ఉక్కు ఫ్యాక్టరీకి గత నెలలో శంకుస్ధాపన చేశామన్నారు. రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ ఏర్పాటు చేసే సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌తో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,100 మంది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసే కంపెనీలు, పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తానని, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చేలా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగ జరిగేలా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ నెల 28వ తేదీన 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. జూలై నుంచి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలో మరో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్లను ఏర్పాటుచేసేందుకు లారస్‌ ల్యాబ్స్‌ ముందుకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. విశాఖ-రాజమహేంద్రవరం మధ్య కార్గో రవాణా కోసం కొత్తగా రెండు లైన్లతో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ సీఎండీ సుమంత్‌ సిన్హా, కో-ఫౌండర్‌ వైశాలి నిగమ్‌ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.

రెన్యూ గ్లోబల్‌ సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ శంకుస్థాపన

రాంబిల్లి మండలం జడ్‌చింతువాలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ నిర్మించ తలపెట్టిన రెండు ప్లాంట్లకు సీఎం చంద్రబాబునాయుడు గురువారం భూమిపూజ చేశారు. హెలిప్యాడ్‌ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయన ముందుగా సంస్థ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, బ్లూప్రింట్‌ నమూనాను పరిశీలించారు. ఉత్పత్తి సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, సంస్థ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా, కో-ఫౌండర్‌ వైశాలీ సిన్హా, ఎమ్మెల్యేలతో కలిసి రూ.4,200 కోట్లతో ఏర్పాటుచేయనున్న 6.5 గిగావాట్ల సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌కు, రూ.1,200 కోట్లతో నిర్మించనున్న 125 మెగావాట్ల హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యువబుల్‌ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాపలకాన్ని ఆవిష్కరించారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

అంతకుముందు జడ్‌.చింతువ హెలిప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్‌, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ తుహిన్‌సిన్హా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్‌, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కోట్ని బాలాజీ, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, స్థానిక నేతలు దూళి రంగనాయకులు, లాలం భతర్‌, వి.దిన్‌బాబు, పప్పల నూకన్నదొర తదితరులు వున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 01:13 AM