Share News

వదలని ముసురు

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:00 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీని ముసురు వదలడం లేదు.

వదలని ముసురు
సీలేరులో వర్షం

మన్యంలో మోస్తరు నుంచి భారీ వర్షం

జన జీవనానికి ఆటంకం

సీలేరు-మోతుగూడెం రోడ్డుపై కూలిన చెట్టు

పాడేరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీని ముసురు వదలడం లేదు. దీంతో గత నాలుగు రోజులుగా ముసురు కొనసాగుతున్నది. శనివారం పాడేరు మొదలుకుని అన్ని ప్రాంతాల్లోనూ జల్లులు, ఒక మోస్తరు వర్షం కురుస్తున్నది. ముఖ్యంగాఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. తాజా వాతావరణం జన జీవనానికి అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు మాత్రం ఉపయోగమని రైతులు అంటున్నారు. తాజా వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో శనివారం కొయ్యూరులో 27.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 25.5, పాడేరు, చింతపల్లిలో 24.0, పెదబయలులో 23.1, ముంచంగిపుట్టులో 22.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీలేరులో..

సీలేరులో శనివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రోజువారీ కూలీలకు ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్రవారం రాత్రి సీలేరు-మోతుగూడెం రహదారిపై రెండు భారీ చెట్లు కూలిపోవడంతో ఆరు గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులే డబ్బులు సేకరించి, సమీప గ్రామాల గిరిజనులను తీసుకొచ్చి చెట్లను నరికించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

చింతపల్లిలో

మండలంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు విడతల వారీగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా చిరు జల్లులు కురిశాయి. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకున్నది. వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సివచ్చింది.

హుకుంపేటలో..

హుకుంపేటలో శనివారం వర్షం కురవడంతో వారపు సంతకు వచ్చిన వర్తకులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంతలో షెడ్లు లేకపోవడంతో టార్పాలిన్ల షాపుల్లో సరుకులు విక్రయిస్తారు. వర్షం కురవడంతో సరుకులన్నీ తడిచిపోయాయి. సంతలో నడిచే దారి అంతా చిత్తడిగా మారడంతో రాకపోకలకు సంతకు వచ్చేవారు అవస్థలు పడ్డారు.

Updated Date - Jul 04 , 2026 | 11:00 PM