అతీగతీలేని హాస్టల్
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:13 AM
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో బాలిక వసతిగృహం ఏర్పాటు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, అధికారులు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. వైసీపీ హయాంలో నిధులు మంజూరైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఎటువంటి కదలిక లేదు.
కృష్ణాదేవిపేటలో కార్యరూపం దాల్చని బాలికల వసతిగృహం
ఏడేళ్ల క్రితం టీడీపీ హయాంలో స్థలం సేకరణ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోని పాలకులు
ఏడాది క్రితం రూ.2 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
అయినా ఇంతవరకు మొదలుకాని పనులు
నిత్యం రాకపోకలకు ఇబ్బంది పడుతున్న పలు గ్రామాల బాలికలు
కృష్ణాదేవిపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో బాలిక వసతిగృహం ఏర్పాటు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, అధికారులు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. వైసీపీ హయాంలో నిధులు మంజూరైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఎటువంటి కదలిక లేదు.
కృష్ణాదేవిపేట (ఏఎల్‌పురం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 900 మందికి విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 500మందికిపైగా బాలికలే ఉన్నారు. ఇందులో 150 మంది విద్యార్థినులు కృష్ణాదేవిపేట నుంచి మూడు కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ దూరంలోని కొయ్యూరు మండలం శరభన్నపాలెం, పి.మాకవరం, రామరాజుపాలెం, కొండగోకిరి, గుజుమన్నపాకల, గొలుగొండ మండలం కొంగసింగి, సీహెచ్ నాగాపురం, పాతకృష్ణాదేవిపేట, రామచంద్రపురం తదితర గ్రామాల నుంచి వస్తుంటారు. కొంతమంది పది కిలోమీటర్ల దూరం నుంచి సైకిళ్లు, ఆటోలు, బస్సుల్లో వచ్చిపోతుంటారు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో త్వరగా సూర్యాస్తమయం కావడం వల్ల విద్యార్థినులు సాయంత్రం ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. దీంతో 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దూరప్రాంతాల నుంచి వచ్చే బాలికల కోసం హాస్టల్ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కృష్ణాదేవిపేటలో ప్రభుత్వం జూనియర్ కళాశాలకు సమీపంలో 30 సెంట్ల స్థలాన్ని సేకరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు.. హాస్టల్ నిర్మాణం విషయాన్ని గాలికొదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టైప్-4 బాలికల వసతిగృహం నిర్మాణం కోసం 2024-25లో సమగ్ర శిక్ష నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది మార్చిలో తహశీల్దారు శ్రీనివాసరావు, గతంలో హాస్టల్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నిధులు మంజూరయ్యాయని, త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇది జరిగి సుమారు పది నెలలు అయ్యింది. ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు. దీనిపై సమగ్ర శిక్ష జేఈఈ సత్యనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, అందరికన్నా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌తో త్వరలో టెండర్ అగ్రిమెంట్ పూర్తిచేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు.