Share News

కన్నీటి సంద్రం

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:05 AM

తీరంలో కన్నీరొలికింది. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను రాకాసి అల కబళించింది.

కన్నీటి సంద్రం

ఐటీ సెజ్‌ సమీపాన సముద్ర స్నానానికి దిగిన ముగ్గురు బాలురు గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం

మరో ఇద్దరి కోసం గాలింపు

మృతులు తొమ్మిదో తరగతి విద్యార్థులు

గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు

సాగర్‌నగర్‌/మధురవాడ/కొమ్మాది, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి)

తీరంలో కన్నీరొలికింది. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను రాకాసి అల కబళించింది. సెలవు రోజున సరదాగా గడిపేందుకు సముద్రం ఒడ్డుకు చేరిన స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టి వారి కుటుంబాల్లో తీరని మనోవేదన మిగిల్చింది. ఐటీ సెజ్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మూడు కుటుంబాలను తీవ్ర విషాదంలో నింపేసింది.

నగర పరిధిలోని మధురవాడ పరిసర ప్రాంతాలైన మల్లయ్యపాలెం, వాంబే కాలనీలకు చెందిన సత్తారువ సూర్యప్రకాష్‌ (14), సత్తారువ హేమంత్‌ (15), సబ్బవరపు నితేష్‌ (14), పి.ప్రశాంత్‌ (14), పసగడ హేమంత్‌కుమార్‌ (18), ఆనమకొండ నగేష్‌ (18) మంచి స్నేహితులు. తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వీరంతా సెలవు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమిలి బీచ్‌రోడ్డు ఐటీ పార్కు జంక్షన్‌ సమీపానున్న బీచ్‌కు వెళ్లారు. వీరిలో సూర్యప్రకాష్‌, నితేష్‌, పి.ప్రశాంత్‌, సత్తారువ హేమంత్‌ సముద్ర స్నానానికి దిగారు. పసగడ హేమంత్‌కుమార్‌, అనమకొండ నగేష్‌ తీరంలో ఉన్నారు. నలుగురు బాలురు మోకాళ్ల లోతు నీటిలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కెరటం వారిని తాకింది. ఈ క్రమంలో భవానీ మాలలో ఉన్న హేమంత్‌ ఒడ్డున పడిపోగా, అతడి సోదరుడు సూర్యప్రకాశ్‌తో పాటు నితేష్‌, ప్రశాంత్‌ లోపలికి కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారి కోసం హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల తల్లిదండ్రులు బీచ్‌లో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఆవిరైన ఆశలు...

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. ఒకరి నాన్న టైలర్‌. మరొకరు ఆటో డ్రైవర్‌. ఇంకొకరు వెల్డర్‌. తమలా పిల్లలు కష్టపడకూడదని ఒక్కో రూపాయి కూడబెట్టి, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి మరీ చదివిస్తున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకుని, అండగా ఉంటారని ఆశించారు. అయితే విధి వారి ఆశలపై నీళ్లు చల్లింది. సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని శాశ్వతంగా దూరం చేసేందని బావురు మంటున్నారు. గల్లంతైన వారిలో మల్లయ్యపాలేనికి చెందిన సూర్యప్రకాశ్‌ తెలివైనవాడు. బాగా చదువుతాడు. అతడి తండ్రి భాస్కరకుమార్‌ వెల్డర్‌. మరో బాలుడు సబ్బవరపు నితీశ్‌ తండ్రి చినబాబు ఆటోడ్రైవర్‌. మరో విద్యార్థి పిల్లా ప్రశాంత్‌ తండ్రి టైలర్‌. వాంబే కాలనీలో నివసిస్తున్నారు.

హోం మంత్రి దిగ్ర్భాంతి

సముద్రంలో ముగ్గురు విద్యార్థుల గల్లంతవడంపై రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్య్తక్తం చేశారు. జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీరప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 03 , 2026 | 01:05 AM